(గుండాల కృష్ణ, రంగనాథ్ మిద్దెల)
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): సాధారణంగా బుల్డోజర్కు ఆలోచనా శక్తి ఉండదు. ఒక్కసారి పని మొదలు పెట్టిందంటే కూల్చుకుంటూ పోవుడే. కానీ కాంగ్రెస్ (Congress) సర్కారు తెచ్చిన హైడ్రా (HYDRAA) బుల్డోజర్ మాత్రం అత్యంత తెలివైనది! దానికి పేదోళ్లు.. పెద్దోళ్లన్న విచక్షణ తెలుసు. అందుకే గత 15 నెలల్లో సామాన్యులున్న 612 చోట్ల కూల్చివేతల పర్వాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. హైడ్రా దృష్టికి ఈ ఆక్రమణలు మాత్రమే వచ్చాయా?! ఇది బేతాళ కథలకు భిన్నం సుమా! ఎందుకంటే అక్కడ సమాధానం తెలిసీ చెప్పకపోతే తల వేయి ముక్కలవుతుందని బేతాళుడు బెదిరిస్తాడు. కానీ ఇక్కడ సమాధానం తెలిసినా చెప్తే ‘నీ తల వేయి ముక్కలవుతుంది’ అనే హెచ్చరికలు వినిపిస్తుంటాయి. హైడ్రా కూల్చివేతలు మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు నష్టపోయింది అధిక భాగం సామాన్య కుటుంబాలే. ఇంకా భయపడుతున్నదీ సామాన్యులే.
బడా బాబుల అక్రమ నిర్మాణాలు ఆకాశాన్నంటుతున్నా.. ప్రభుత్వ పెద్దల బంధువులు, అండదండలున్న పెద్దోళ్ల నిర్మాణాలు ‘లేక్‌వ్యూ’లో ఉన్నా అవి పదిలంగా ఉండేందుకు రాత్రికి రాత్రే ఏదో ఒక పాలసీ బయటికొస్తుంది. ఒకరికి నోటీసులిచ్చి నెలల తరబడి గడువిస్తారు. ఇంకొకరికి నోటీసు ఇచ్చి, అది అర్థం చేసుకునేలోపే నేలమట్టం చేసిపోతారు. ఒకరి విషయంలో హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని అడుగు ముందుకేయరు.. ఇంకొకరి విషయంలో హైకోర్టు ఆదేశాలున్నా తొక్కుకుంటూ పోతారు. ఒకరికి రెవెన్యూ శాఖ నివేదికలు లేవని అక్రమ నిర్మాణాలకు అభయమిస్తారు.. ఇంకొకరికి ‘హైడ్రాకు ఒకరి నివేదికలెందుకు.. ఎన్ఎస్ఆర్సీ వంటి అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగిస్తాం’ అంటారు. ఒకరికి ఎఫ్టీఎల్ తుది నివేదిక లేదని వదిలేస్తారు.. ఇంకొకరికి హైడ్రానే సొంతంగా చెరువు విస్తీర్ణాన్ని రూపొందించిందని చెప్తారు. ఇలా ఆ ఒకరు ఎవరో.. ఇంకొకరు ఎవరో బుల్డోజర్కు బాగా తెలుసు. అందుకే హైడ్రా బుల్డోజర్ చాలా తెలివైనదంటారు. అదెలాగో ఆధారాలతో సహా మీరే చదవండి.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లంపేటలోని కత్వాచెరువు వద్ద 17 విల్లాలను హైడ్రా కూల్చివేసిన తాలూకు విధ్వంసమిది. లక్షలాది రూపాయల లోన్ తీసుకుని నిర్మించుకున్న ఇండ్లు నేలమట్టం కావడంతో ఆ విల్లాల యజమానులు గుండెలు బాదుకున్నారు.
గృహ ప్రవేశం చేసిన వారంలోపే ఇల్లు కూలిపోతే ఆ యజమాని బాధ వర్ణనాతీతం. అనుమతులన్నీ ఉన్నాయని ఇంటి యజమానులు అధికారుల కాళ్లావేళ్లా పడ్డా.. కనికరించకపోగా.. అనుమతులు ఇచ్చిన, ఎఫ్టీఎల్ కాదని నిర్ధారించిన అధికారులే హైడ్రాతో కలిసి ఇండ్లకు ఎర్ర ఇంకులతో మార్కులు వేయడం చూసి బాధితుల గుండెలు చెరువయ్యాయి. శత్రువులపై యుద్ధం ప్రకటించినట్టుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హైడ్రా రూపంలో వచ్చి బుల్డోజర్లతో తమ కలల సౌధాలను నేలమట్టం చేయడం చూసి రోదించాయి. అన్ని అనుమతులతో పాటు బ్యాంకు రుణంతో నిర్మించుకున్న ఇంటిని హైడ్రా కూల్చివేస్తే అద్దె ఇంట్లో ఉంటూ కూలిన ఇంటికి ఇప్పటికీ బ్యాంకు ఈఎంఐలు చెల్లించడం దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘటన అని బాధితుడు శశాంక్ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. ఇదే కాదు.. గుట్టల బేగంపేటలోని సున్నం చెరువు బాధితుల బాధ ఇప్పటికీ రావణకాష్టంలానే రగులుతూ ఉన్నది. ఇక సంగారెడ్డి పరిధిలోని అమీన్పూర్, కిష్టారెడ్డిపేటల్లో కూడా ఏండ్ల కిందటి నుంచి నివాసం ఉంటున్న వాళ్లను కట్టుబట్టలతో వీధిన పడేసి హైడ్రా కూల్చివేతలకు పాల్పడింది. రాయదుర్గంలో ఎనిమిది దశాబ్దాలుగా నివాసముంటున్న వారిని బయటికి పంపి ఆ ఇంటిని కూల్చివేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది.

హైదరాబాద్ నగరవాసులకు తాగునీటిని అందించే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల పరిధిలో ఫాంహౌస్‌లు కట్టుకొని అందులోంచి మురుగును జలాశయాల్లోకి పంపితే నగరవాసులు వాటిని తాగాలా? అని సాక్షాత్తూ సీఎం రేవంత్‌రెడ్డి అనేక వేదికలపై ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి ఫాంహౌస్‌లు ఎవరివైనా! ఎంత పెద్దవారివైనా! చివరకు కాంగ్రెస్ పార్టీ నేతలవైనా కూల్చడం ఖాయమని బీరాలకు పలికారు. కానీ రెండు సంవత్సరాలుగా ఏం జరిగింది? ఇదిగో ఫిర్యాదులు.. అదిగో కూల్చివేతలంటూ సామాన్యుల ఇండ్లను బుల్డోజర్ల కింద నలిపిన హైడ్రా నేటికీ ఆ ఫాంహౌస్‌ల వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామితో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రారావు ఇలా ఒకరేమిటి! అనేక మంది కాంగ్రెస్ పెద్దల ఫాంహౌస్‌లు లేక్‌వ్యూ ప్రాతిపదికన ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. బీఆర్ఎస్, మీడియా, సామాజిక మాద్యమాల్లో సామాన్యులు ముక్తకంఠంతో సామాన్యులపట్ల వ్యవహరించినట్టుగానే వీరికీ బుల్డోజర్ న్యాయాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తే ‘హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మాణాలను కూల్చివేయం’ అనే ఒకే ఒక్క ప్రకటనతో కాంగ్రెస్ ప్రభుత్వం బారాఖూన్ మాఫీ అని ప్రకటించింది.

హైదరాబాద్‌లో శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గంలో భారీపోలీసు బందోబస్తు నడుమ మూడు నివాసాలు, ఐదు నిర్మాణాలు కూల్చివేశారు. తాతముత్తాతల నాటి భూమి.. హైదరాబాద్ టెన్నరీస్ సంస్థను ప్రారంభించినప్పటికే 37.08 ఎకరాల భూమి ఉన్నది. కానీ అధికారులు ఆ స్థలమంతా లిడ్క్యాప్దంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారికి కేవలం ఐదెకరాల స్థలం మాత్రమే ఉన్నదని బాధితుడు నసీర్అలీఖాన్ కూల్చివేతల సమయంలో నెత్తీనోరు బాదుకున్నాడు.
ఎనభైఏళ్ల నుంచి అదే ఇంట్లో ఉంటున్నామని, తమకు స్టేటస్కో ఉన్నదని చెప్తున్నా వినకుండా కూల్చివేయడంతో బాధితులు రోడ్డున పడ్డారు. సున్నంచెరువులోనూ ఇదే తరహాలో తమకు పర్మిషన్లు, కోర్టు ఆర్డర్లున్నాయని ఎంత చెప్పినా వినకుండా హైడ్రా మూడు, నాలుగంతస్తుల భవనాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేసింది.50 ఏండ్ల నుంచి ఉంటున్న భూములను సైతం స్వాధీనం చేసుకోవాలని చూస్తే వారు కోర్టుకు పోయారు. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా సున్నం చెరువును తాము తీసుకున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో ఒకటిగా చూపి ఏదో ఒకరకంగా బాధితులను బెదిరించి బయటకు పంపాలని చూస్తున్నారని సియెట్ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులను ఈ ప్రాంతంలోనూ హైడ్రా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో హైడ్రా ఉల్లంఘనలపై కోర్టుకు బాధితులు ఫోటోలు, వీడియోలను కూడా సాక్ష్యంగా సమర్పించారు.

దుర్గం చెరువు వైపు కదలని హైడ్రా బుల్డోజర్
హైడ్రా బుల్డోజర్లకు పెద్లోళ్లు.. పేదోళ్లు అన్న తేడా లేదన్నరు. అక్రమమైతే చాలు నేలమట్టమన్నరు. కానీ అత్యంత ఖరీదైన ప్రాంతంలోని దుర్గం చెరువు ఎఫ్టీఎల్ వ్యవహారంలో మాత్రం హైడ్రా నాలుక మడతేసింది. కారణం.. అక్కడ సీఎం రేవంత్‌రెడ్డి సొంత అన్న తిరుపతిరెడ్డి ఇల్లు ఉండటమే!
ఒకవైపు చెరువు ఎఫ్టీఎల్-బఫర్‌జోన్లతో పాటు సర్కారు భూముల్లో ఇండ్లు నిర్మించారంటూ పేదోళ్ల ఇండ్లను వరుసగా కూల్చుతున్న సమయంలో మీడియా, సోషల్ మీడియా హైడ్రాను ప్రశ్నించింది. మరి సీఎం అన్న తిరుపతిరెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంటే ఎందుకు స్పందించరని నిలదీసింది. పారదర్శకంగా పేదోళ్లకు చూపిన బుల్డోజర్ న్యాయాన్ని ఇక్కడ కూడా అమలు చేయాల్సిన హైడ్రా బుల్డోజర్ ఇంజిన్ ఆఫ్ చేసి పెట్టుకున్నది. ఇరిగేషన్ శాఖ నింపాదిగా తిరుపతిరెడ్డికి నోటీసులు జారీ చేసి ఏకంగా నెల రోజుల గడువు ఇచ్చింది. కానీ నెల దాటినా తిరుపతిరెడ్డి నుంచి స్పందన లేకున్నా అటువైపు హైడ్రా కన్నెత్తి చూసే ధైర్యం చేయలేదు. చివరికి నెలల తరబడి అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తే తిరుపతిరెడ్డి, ఇతరులు హైకోర్టుకు వెళ్లి స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చారు. అప్పుడు హైకోర్డు ఉత్తర్వులు ఉన్నాయంటూ హైడ్రా చేతులెత్తేసింది. ఇతర ప్రాంతాల్లో హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసి కూల్చిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి సోదరుడు కావడంతో హైడ్రా బుల్డోజర్ ముందుకు కదలలేదు.

ఇది శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలో చోటుచేసుకున్న హృదయవిదారక దృశ్యం. అక్కడేమో సీఎం సోదరుడి ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నదని నోటీసులు ఇచ్చి నెలల తర్వాత హైకోర్టు స్టే వచ్చినదాకా వేచి చూసిన హైడ్రా ఇక్కడ మాత్రం నిరుపేదలను నిద్ర నుంచి లేపి మరీ నడిరోడ్డు పాలు చేశారు. ఖాజాగూడలోని భగీరథమ్మ చెరువు బఫర్‌లో గుడిసెలు వేసుకున్నారంటూ హైడ్రా బుల్డోజర్లు డొక్కలెండిన పేదలపై ఉరిమాయి.
నోటీసులు ఇచ్చి.. 24 గంటలు కూడా గడవకముందే హైడ్రా అధికారులు వచ్చి గుడిసెలను నేలమట్టం చేశారు. వండుకునే పాత్రలు, ఇతర సామాన్లు ఉన్నా పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టారు. దీంతో ఆ అభాగ్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కట్టుబట్టలతో బయటికొచ్చారు. కొన్ని సామాన్లు తీసుకొని రోడ్డుపై పెట్టి వాటిపైనే ఎండలో చతికిలపడిపోయారు. మధ్యాహ్నం చిన్న పిల్లలు ఆకలితో ‘అమ్మా.. అన్నం పెట్టు’ అని అడిగితే నిలువ నీడలేని ఆ నిరుపేద తల్లిదండ్రులు ఆ చిన్నారి కడుపు నింపే మార్గంలేక విలవిలలాడిపోయారు. అయినా హైడ్రా కనికరం చూపలేదు. ముఖ్యమంత్రి సోదరుడితో పాటు పెద్దోళ్లకేమో న్యాయపరంగా రక్షణ తెచ్చుకునే వరకు వేచి చూసిన హైడ్రా ఇక్కడ ఈ నిరుపేదలకు వారం రోజుల గడువు ఇచ్చి ప్రత్యామ్నాయ నీడ చూసుకునేదాకా ఆగలేకపోయిందా? ఎలాంటి ఆదరువులేని ఆ పేదలను రోడ్డుకీడ్చినా అడిగే దిక్కు ఉండదనే ధైర్యంతోనే కదా హైడ్రా ఆకలి కడుపులపైకి బుల్డోజర్లను తోలిందని జనం మండిపడ్డారు.

అత్తాపూర్‌లోని అత్యంత ప్రాచీనమైన అనంత పద్మనాభస్వామి ఆలయ చెరువు ఇది. దీనికి సంబంధించిన కోనేరును అనంతపద్మనాభస్వామి కుంటగా పిలుస్తారు. సర్వేనంబర్ 365లో 6.02గుంటల్లో విస్తరించిన ఈ కుంటను కబ్జా చేసేందుకు కొంతకాలంగా కొందరు ప్రయత్నిస్తున్నారు.
అనంతపద్మనాభస్వామి కుంట విషయంలో హైడ్రా ఏమాత్రం స్పందించడం లేదు. చెరువు చుట్టూ కట్ట అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులిస్తే ఆ పనులను స్థానిక నేతలు కొందరు కాంగ్రెస్ పెద్దలతో కలిసి అడ్డుకున్నారు. భారీ వర్షాలతో కుంటకు వేసిన కట్ట తెగిపోతే అనంతపద్మనాభ స్వామి ఆలయంతో పాటు అందులోనే ఉన్న గోశాల పక్కనే ఉన్న పాండురంగానగర్, హుడా కాలనీలు మునిగిపోతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో కుంటను కాపాడాలంటూ ఆగస్టులో హైడ్రాకు, ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు వచ్చి కుంట విషయంలో కోర్టులో కేసు నడుస్తున్నదంటూ సాకుచూపి వెనుదిరిగారు.

ఇది మాదాపూర్ గుట్టల బేగంపేటలోని సున్నం చెరువు. ఏడాది కాలంగా హైడ్రా తరుముతుంటే నిరుపేదలు గూడు చెదిరి కకావికలమైతే.. పైసా పైసా కూడబెట్టి ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు దిక్కుతోచక న్యాయం కోసం చకోర పక్షుల్లా తిరుగుతున్నారు. వాస్తవానికి ఈ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ నిర్ధారణలపై ఇప్పటిదాకా తుది నోటిఫికేషన్ విడుదల కాలేదు.

ఒవైసీకి చెందిన సల్కం చెరువు విషయంలో తుది నివేదిక వచ్చేదాకా చెరువుల జోలికి వెళ్లమని చెప్తున్న హైడ్రా ఇక్కడేమో ప్రాథమిక నివేదిక ఆధారంగానే ప్లాట్లు ఎఫ్టీఎల్లో ఉన్నాయంటూ ఏకంగా సుందరీకరణ పనులు చేపడుతున్నది. పైగా రెవెన్యూ రికార్డుల్లో సున్నం చెరువు విస్తీర్ణం 24.12 ఎకరాలు ఉంటే హెచ్ఎండీఏ ప్రాథమిక నివేదికలో 15.23 ఎకరాలుగా ఉన్నది. హైడ్రా విస్తీర్ణాన్ని ఏకంగా 42.07 ఎకరాలుగా ప్రకటించింది. ప్రభుత్వ విభాగాల్లోనే విస్తీర్ణంపై స్పష్టత లేదు. కానీ అక్రమ నిర్మాణాలంటూ గతంలో అనుమతులున్న నాలుగంతస్తుల భవనంతో సహా పలు నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. నాలుగు దశాబ్దాల కిందట పైసా పైసా కూడబెట్టి ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన సియెట్ కాలనీ ఎఫ్టీఎల్లో ఉన్నదంటూ దౌర్జన్యంగా సుందరీకరణ పనులు చేపట్టారు.
పిల్లల పెండ్లి, జీవనోపాధిలా ఉంటుందనుకున్న ప్లాట్లను హైడ్రా ఇలా గుంజుకోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయిస్తే కోర్టు స్టే ఇచ్చింది. పనులు చేపట్టవద్దని హెచ్చరించింది. కానీ హైకోర్టు ఆదేశాలనూ హైడ్రా బేఖాతరు చేస్తున్నది. ఇదేమని ప్రశ్నిస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను మీ దిక్కున్న చోట చెప్పుకోవాలంటూ చెప్తున్నది. ప్రభుత్వం దగ్గరికిపోయి పరిహారం తీసుకోవాలని అంటున్నది. ఆదిలో ఆదుకుంటానని చెప్పిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా మౌనముద్ర వేశారు. దీంతో ఏడాదిగా న్యాయం ఎక్కడ దొరుకుతుందో తెలియక సియెట్ కాలనీవాసులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఎక్కే గడప దిగే గడప అన్నట్టుగా తిరుగుతున్నారు.

ఏడాదైనా జయభేరిపై చర్యలేవి?
అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్‌రాంగూడలోని సర్వేనంబర్ 106లో ఉన్న రంగ్లాల్కుంట ఎఫ్టీఎల్. 5.36 ఎకరాల విస్తీర్ణం. 2024, సెప్టెంబర్ ఆరో తేదీన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు, ఎఫ్టీఎల్ను పరిశీలించారు. అక్కడ మట్టితో నింపి ఎఫ్టీఎల్ స్థలాన్ని కబ్జా చేసిన జయభేరి సంస్థ రేకులతో ప్రహరీ ఏర్పాటు చేసిందని గుర్తించారు.
చెరువు పూర్తిగా కబ్జాకు గురవడంతోపాటు వచ్చే వరద నీటిని రాకుండా పలు నిర్మాణాలు కూడా ఉన్నాయి. నాలాలను మళ్లించి చెరువు పక్కనే బడా సంస్థలు అపార్ట్మెంట్లనే నిర్మించాయి. అప్పటివరకు హైడ్రా కూల్చివేతల పర్వాన్ని చూస్తే ఎలాంటి నోటీసులు లేకుండా బుల్డోజర్లతో ఆ రేకులను తొలగించి, చెరువు ఎఫ్టీఎల్ను పునరుద్ధరించాలి. కానీ పెద్దోళ్లు కదా! నోటీసులు జారీ చేయించారు. పదిహేను రోజుల్లో ఆక్రమణలు తొలగించాలని హెచ్చరించారు. ఇందుకు ప్రతిగా స్పందించిన జయభేరి సంస్థ హైడ్రా షెడ్లను తొలగించాల్సిన అవసరంలేదని, తామే తొలగిస్తామని ప్రకటించింది. కానీ తెర వెనుక ఏం జరిగిందో తెలియదు! ఏడాది దాటింది.. ఇప్పటికీ ఆ ఆక్రమణలు తొలగిపోలేదు. అటువైపు హైడ్రా కన్నెత్తి చూడటం లేదు.