దిలావర్పూర్ నవంబర్ 26 : దిలావర్పూర్ మరో లగచర్లను తలపించింది. ఎనిమిది నెలలుగా ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లాలో రైతులు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. కడుపు మండిన అన్నదాతల నినాదాలతో మంగళవారం దిలావర్పూర్ జాతీయ రహదారి దద్దరిల్లింది. దాదాపు నాలుగు గ్రామాలకు చెందిన నాలుగు వేల మంది రైతులు, యువకులు, మహిళలు కుటుంబాలతో సహా రోడ్డుపైనే బైఠాయించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రోడ్డుపైనే వంటావార్పు చేసి సామూహిక భోజనాలు చేసి బాధితులు నిరసన తెలిపారు. నచ్చజెప్పేందుకు వచ్చిన నిర్మల్ ఆర్డీవో రత్నకల్యాణిని అడ్డుకున్నారు. కలెక్టర్ వచ్చి లిఖితపూర్వంగా హామీ ఇచ్చేదాకా ఇక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించుక్కూర్చోవడంతో చేసేదేంలేక తిరిగి వెళ్తున్న ఆర్డీవోను మహిళలు చుట్టుముట్టారు. దాదాపు ఆరు గంటలకుపైగా ఆమెను వాహనంలోనే నిర్బంధించారు. చివరికి పోలీసులు బలగాలతో వచ్చి ఆర్డీవోను తీసుకెళ్లగా కోపం కట్టలు తెంచుకున్న రైతులు అక్కడే ఉన్న ఆమె వాహనాన్ని ధ్వంసం చేసి నిప్పుపెట్టారు.
12గంటలు ఆందోళన
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని గుండంపల్లి, దిలావర్పూర్ గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమను నిర్మించవద్దని నాలుగు వేల మంది రైతులు, యువకులు, మహిళలు, ప్రజలు ధర్నా నిర్వహించారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్మల్-భైంసా జాతీయ రహదారి-61పై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. విషయం తెలియడంతో ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా నిజామాబాద్ నుంచి కూడా దాదాపు 500 మందికి పైగా పోలీసులు భారీ ధర్నా ప్రదేశానికి చేరుకున్నారు. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కలెక్టర్ వచ్చి పరిశ్రమను తరలిస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని రైతుల పట్టుబట్టారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు శ్రమించి ఇతర మార్గాల ద్వారా కొన్ని వాహనాలను తరలించారు.
కేసులు పెడతామని పోలీసులు భయపెడుతున్నరు
పరిశ్రమ వద్దని శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే.. పోలీసులు తమపై కేసులు పెట్టి భయాందోళనలు సృష్టిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో పరిశ్రమ కోసం జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పిన కలెక్టర్, మూడు నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. తమ వద్దకు కలెక్టర్ అభిలాష అభినవ్ వచ్చి పరిశ్రమను తరలిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘ఎన్నికలప్పుడే మేం గుర్తొస్తం.. ఎనిమిది నెలల నుంచి ఆందోళన చేస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు’ అని మండిపడ్డారు. గతంలో కలెక్టర్ కార్యాలయానికి పిలిచి తమకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని, తమను కలెక్టర్ అవమాన పరిచారని, కలెక్టర్ వచ్చి పరిశ్రమను తరలిస్తామని లిఖిత పూర్వకంగా రాసిస్తే తప్ప ధర్నా విరమించేది లేదని తేల్చిచెప్పారు. ఎముకలు కొరికే తీవ్రమైన చలిలో కూడా పిల్లాపాపలతో రైతులు రోడ్డుపైనే వంట చేసుకొని చలి మంటలు కాగుతూ నిరసన తెలుపుతున్నారు. కాగా నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల ఇక్కడే ఉండి శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న సమయంలో 108 అంబులెన్స్‌లు రావడంతో మానవతా దృక్పథంతో దారిచ్చారు. ‘మా నాయకులు కనిపించడం లేదు’ అని మహిళలు ఫ్లెక్సీలు పట్టుకొని నిరసన తెలిపారు.
ఆరు గంటల పాటు ఆర్డీవో నిర్బంధం
రైతులకు నచ్చజెప్పాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్మల్ ఆర్డీవో రత్నకల్యాణి ధర్నా ప్రదేశానికి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగా ‘ఇథనాల్ పరిశ్రమ వద్దు.. పచ్చని పొలాలు ముద్దు’ అని నినాదాలు చేశారు. కలెక్టర్ రావాలని పట్టుబట్టడంతో చేసేదేం లేక వెనుదిరుగుతున్న సమయంలో ఆమె వాహనాన్ని అడ్డుకొని మహిళలు చుట్టుముట్టారు. ఆర్డీవో దాదాపు ఆరు గంటలకుపైగా వాహనంలోనే ఉండిపోయారు. బయటకు వెళ్లొస్తానని చెప్పినా మహిళలు వినిపించుకోలేదు. పోలీసులు కూడా చాలాసార్లు తీసుకెళ్తేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. దాదాపు రాత్రి పది గంటల ప్రాంతంలో నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల భారీ పోలీసు బందోబస్తుతో ఆర్డీవోను వేరే వాహనంలో నిర్మల్‌కు తరలించారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఆర్డీవో ఇక్కడే వదిలేసిన వాహనాన్ని కింద పడేసి దహనం చేశారు.