దరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్‌పై పలు కఠినమైన నేరాలు మోపాలని చూసిన రాష్ట్ర ప్రభుత్వ యత్నాలకు ఆదిలోనే చుక్కెదురైంది. నాంపల్లిలోని సింగరేణి భవన్ ఎస్ అండ్ పీసీ విభాగం, పోలీసులు మోపిన తీవ్ర సెక్షన్లను తొలగించాలని నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల బొగ్గుగని కార్మిక సంఘం సమావేశంలో సుమన్ చేసిన ప్రసంగంపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కేసు నమోదు చేయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో శనివారం అరెస్టు చేసిన పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత (ఆదివారం తెల్లవారుజామున) నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
పోలీసులు ఆయనపై తీవ్ర నేరాలకు సంబంధించి అనేక అభియోగాలను మోపారు. రాష్ట్ర ప్రభుత్వం బాల్కసుమన్‌ను ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో స్థానిక పోలీసులపై ఒత్తిడి తెచ్చి నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించింది. నాంపల్లి పోలీసులు బాల్క సుమన్‌పై బీఎన్ఎస్లోని 326(జీ),152, 351(బి), 351(3), 353(1)(బీ) సెక్షన్లతోపాటు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజీ యాక్ట్(పీడీపీపీ) సెక్షన్ (4), పేలుడు పదార్థాలు ఉపయోగించడం, ప్రజా ఆస్తులు ధ్వంసం చేయడం, ప్రార్థనాలయాలను ధ్వంసం చేయడం, వంటి నేరాలకు పెట్టే బీఎన్ఎస్ 326 (జీ)ని కూడా నమోదుచేశారు. వీటితోపాటు బీఎన్ఎస్లోని 353 క్లాజ్ 1, బీఎన్ఎస్లోని సెక్షన్లు 55, 61 (2)లను కూడా చేర్చారు.
ఇవన్నీ అత్యంత నేరపూరితమైన చర్యలకు నమోదు చేసే సెక్షన్లు. వీటిలో పీడీపీపీ యాక్ట్ కింద కేసు పెడితే ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఇవన్నీ కనీసం ఐదు నుంచి పదేండ్ల జైలు శిక్షపడే అవకాశం ఉన్న నాన్‌బెయిలబుల్ సెక్షన్లు. ఇంతటి కఠిన సెక్షన్లు పెట్టడం సరికాదని బీఆర్ఎస్ పార్టీ తరఫు న్యాయవాది జక్కుల లక్ష్మణ్ తదితరులు శనివారం అర్ధరాత్రే న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు దేశంలోని పలు రాష్ర్టాల్లో ఇదే తరహా కేసులు, బెయిల్ ఇచ్చే అవకాశాలు వంటివాటిని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, రిమాండ్ సందర్భంగానే రిజెక్షన్ మెమో కూడా బాల్కసుమన్ తరఫు న్యాయవాదులు దాఖలు చేశారు. వీటిపై న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. బాల్కసుమన్‌పై పెట్టిన పీడీపీపీ యాక్ట్ రెడ్ విత్ 55, 61(2)తో పాటు సెక్షన్ 326(జీ), 351(3) బీఎన్ఎస్ సెక్షన్లను తొలగించాలని సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
బాల్క సుమన్‌ను రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, ఎలాంటి నేరం జరగకపోయినా జైల్లో పెట్టడం అన్యాయమని బీఆర్ఎస్ వాదించింది. కఠినమైన సెక్షన్లను జోడించడం ద్వారా బాల్కసుమన్కు బెయిల్ రాకుండా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ ఆరోపించింది. అయితే, న్యాయస్థానం కఠినమైన సెక్షన్ల వ్యవహారంలో ఇచ్చిన ఉత్తర్వులపై బీఆర్ఎస్ హర్షం వ్యక్తం చేసింది.
బాల్కసుమన్‌పై తప్పుడు కేసులు నమోదు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజీ యాక్ట్ పెట్టారు. దీనిపై రిమాండ్ రోజే బీఆర్ఎస్ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రజల ఆస్తులకు నష్టమే జరుగనపుడు ఈ సెక్షన్ వర్తించదని గట్టిగా వాదించారు. దీంతోపాటు ఎలాంటి పేల్చడాలు, కాల్చడం, నిప్పు పెట్టడమే లేనపుడు బీఎన్ఎస్లోని 326 కూడా వర్తించదని, పబ్లిక్ మిస్చిఫ్ కింద పెట్టిన బీఎన్ఎస్ 353 క్లాజ్ 1 కూడా అర్థంపర్థంలేనిదని, పోలీసులు సరైన విచారణ జరరుపకుండానే కేవలం రాజకీయ ఒత్తిడితో కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. బీఆర్ఎస్ న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది.
సుమన్‌కు బెయిల్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ న్యాయవాదులు మంగళవారం సెషన్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్నారు.