తొర్రూరు, నవంబర్ 10 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గోపాలగిరిలో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులో గందరగోళం నెలకొన్నది. ఇల్లు ఒకరు కడితే.. బిల్లు మరొకరి ఖాతాలో జమ చేశారు. గ్రామానికి చెందిన ధర్మారపు ఎల్లమ్మకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. దీంతో బేస్మెంట్ లెవల్ వరకు నిర్మించింది. రూ. రెండు లక్షలు ఖర్చయ్యాయి. అధికారులు వచ్చి ఫొటోలు తీసి నివేదిక పంపించారు. కొద్దిరోజుల తర్వాత మొదటి విడత బిల్లు రూ.లక్ష జమైందని చెప్పారు. కానీ ఆమె బ్యాంకు ఖాతాలో రూపాయి కూడా పడలేదు.
తర్వాత ఆధార్ కార్డుతో చెక్ చేయగా అదే గ్రామానికి చెందిన ధర్మారపు ఉప్పలమ్మ ఖాతాలో డబ్బు జమైనట్టు తెలిసింది. అధికారులకు చెప్పి నాలుగు నెలలైనా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితురాలు ఎల్లమ్మ వాపోయింది. తాను చేసిన ఖర్చు, కట్టిన ఇల్లు అంతా వృథా అయిందని, ఇప్పటికైనా అధికారులు తప్పిదాన్ని సరిదిద్ది తనకు రావాల్సిన మొదటి విడత బిల్లు లక్ష ఇప్పించాలని వేడుకుంటున్నది. ఎల్లమ్మకు రావాల్సిన డబ్బు ఆమె ఖాతాలో జమచేసేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు.