హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన పామాయిల్ సాగు సత్ఫలితాలనిస్తున్నది. పంట చేతికి రావడంతో రైతు ముఖంలో ఆనందం కనిపించింది. 2022లో నల్లగొండ జిల్లా తేలకంటిగూడెంలో 20 ఎకరాల్లో రైతులు పామాయిల్‌ను సాగు చేశారు. మూడేండ్ల తర్వాత బుధవారం రైతు విజయనాథ్రెడ్డి పొలంలో పామాయిల్ గెలలను ఉద్యాన శాఖ అధికారుల సమక్షంలో కోశారు.
తొలి కోతలో ఎకరాకు 3 టన్నులకుపైగా దిగుబడి వచ్చినట్టు జిల్లా ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి తెలిపారు. ప్రస్తుతం టన్ను ధర రూ.21వేలు ఉందని చెప్పారు. ఎకరానికి రూ.40వేల వరకు మిగులుతుందని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో పామాయిల్ సాగు కోసం ప్రభుత్వం భారీగా రాయితీ అందించింది.