Grama Panchayati | కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : మిషన్ భగీరథ నీటి ట్యాంకు కింద చుట్టూ తడకలు, చెక్కలతో నిర్మించిన ఈ చిన్న డేరా చూసి ఓ నిరుపే ద కుటుంబానికి చెందినది కావచ్చు అనుకుంటారు. కానీ అందులో ఉన్నది ఒక గ్రామ పంచాయతీ కార్యాలయం అంటే ఆశ్చర్యపోవాల్సిందే. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని రాజగూడా గ్రామ పంచాయతీ కార్యాలయం దుస్థితి ఇది. కొత్త పంచాయతీగా ఏర్పడిన నాటి నుంచి రాజగూడా సర్పంచ్ జంగుబాయి ఇంట్లో పంచాయతీ కార్యాలయం కొనసాగింది. ఆమె పదవీ కాలం ముగియడంతో గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు కింద పిల్లర్లకు చుట్టూ తడకలు, చెక్కలతో చిన్న డేరాలో ఏర్పాటు చేశారు. దాదాపు ఏడాదిన్నరగా సిబ్బంది, గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నా అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని పలువురు విమర్శిస్తున్నారు.
రాజగూడా చిన్న గ్రామం కావడంతో పంచాయతీ కార్యాలయం నిర్వహణకు అద్దెకు ఇల్లు దొరకడం లేదు. దీంతో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు కింద తాత్కాలిక షెడ్వేసి పంచాయతీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాం. పంచాయతీ రికార్డులను సైతం ఇక్కడే భద్ర పరుస్తున్నాం. పక్కా భవన నిర్మాణం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం.