గండీడ్, జూన్ 12 : మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలోని 27 పంచాయతీల్లో దాదాపు అన్ని గ్రామాల్లోని ప్రజల వ్యక్తిగత ఆస్తులన్నీ ప్రభుత్వ ఆస్తులుగా ఆన్లైన్లో నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతున్నది. అన్ని గ్రామాలకు చెందిన ప్రజల ఇండ్లు, స్థలాలు ప్రభుత్వ స్థలాలుగా.. ప్రభుత్వ భవనాలుగా చూపిస్తుండటం ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎన్నో ఏండ్లుగా తమ పేర్లపై ఉన్న ఆస్తులు దాదాపు ఏడాది కాలంగా ప్రభుత్వ ఆస్తులుగా ఆన్లైన్ రికార్డుల్లోకి ఎక్కడంపై మండిపడుతున్నారు. సొంత ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇందుకు ఎవరు కారణం? మళ్లీ ఎవరి ఆస్తులను వారికి మార్చేదెవరు? అధికారులకు తెలిసి జరిగిందా? లేదా? సాఫ్ట్వేర్ పొరపాటుతో జరిగిందా? అన్నది తెలియాల్సి ఉన్నది.
కానీ రికార్డులు మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొంత ఆస్తులు ఉన్నా.. అమ్మడానికి వీలు లేకుండా.. బ్యాంకు రుణాలు తీసుకోవడానికి స్థానికులు పడుతున్న పాట్లు వర్ణణాతీతం. అధికారులు చేసిన పొరపాటు మండల ప్రజలకు శాపంగా మారింది. అధికారులకు విషయం తెలిసినా ఇంకా ఎలాంటి సవరణ చర్యలు చేపట్టలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రజల ఆస్తి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపై ఉన్నదని, ఇప్పటికైనా స్పందించి నిజమైన యజమానుల పేర్లను రికార్డుల్లో పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. కాగా ప్రజల వ్యక్తిగత ఆస్తులు ప్రభుత్వ స్థలాలుగా మారాయని ఎంపీడీవో మంజులకు ‘నమస్తే’ ఫోన్లో వివరణ కోరగా.. ఆ పనులు చేయాల్సింది తాము కాదని, రెవెన్యూ అధికారులుగా చెప్పుకొచ్చారు. తాను బిజీగా ఉన్నానంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ ఫోన్ పెట్టేశారు.