వరంగల్ : ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు మెరుగవుతున్న దృష్ట్యా విద్యార్థుల సంఖ్యను పెంచాలని వరంగల్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఉపాధ్యాయులు, గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులను కోరారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ పరిధిలోని మొగిలిచెర్ల గ్రామంలో నిర్వహించిన మన బస్తీ- మన బడి కార్యక్రమంలో పాఠశాలను ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు దశలవారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు ఈ పథకాని రూపొందించారని అన్నారు. తొలి విడతలో ఎంపిక చేసిన పాఠశాలల భవనాలకు మరమ్మతులు, రంగులు, ప్రహరీలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ఫర్నీచర్, డిజిటల్ తరగతులు, సోలార్ ప్యానళ్ల ఏర్పాటు పరిశుభ్రమైన తాగునీరు అందిస్తుందని పేర్కొన్నారు.
దీంతో పాటు గ్రీన్ చాక్‌పీస్ బోర్డులు, మేజర్, మైనర్ రిపేర్లు, కిచెన్‌షెడ్స్, టాయిలెట్ల నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణం, హైస్కూళ్లల్లో డైనింగ్‌హాల్స్, విద్యుత్తు సౌకర్యం, ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్ల ఏర్పాటు వంటి పనులను చేపడుతుందని వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతుందని అన్నారు. మన ఊరు-మన బడి కింద రూ.7,289 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
మొదటి దశలో దాదాపు రూ.3,497 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని వివరించారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆకులపల్లి మనోహర్, సుంకరి మనీషా శివ, గద్దె బాబు, జడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, అదనపు కలెక్టర్ శ్రీవాత్స కోట, డీఈవో డి.వాసంతి, జిల్లా సెక్టరియల్ అధికారి సుదీర్ బాబు, పీఏసీఎస్ చైర్మన్ రమేశ్, మాజీ మార్కెట్ చైర్మన్ చింతం సదానందం, స్కూల్ చైర్మన్ డి.అశోక్, ప్రత్యేక అధికారి మురళీధర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి శారద తదితరులు పాల్గొన్నారు.