మెదక్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులపై నిర్లక్ష్యం వహిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విమర్శించారు. ఫలితంగా నీరందక రైతులు పంటలు సాగుచేసే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తంచేశారు. మెదక్ జిల్లాలోని రాయన్‌పల్లి ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుడు మెదక్‌లో భారీ వర్షాలు కురువడంతో రాయన్‌పల్లి ప్రాజెక్టు తూము, అలుగులు, సాగునీటి కాలువలు దెబ్బతిన్నాయని తెలిపారు.
రైతులు తాత్కాలిక మరమ్మతులు చేసుకుని పంటలు పండించుకున్నట్టు చెప్పారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనా ప్రభుత్వం ఇంతవరకు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయలేదని మండిపడ్డారు. మరమ్మతుల కోసం ప్రభుత్వనికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు చేయడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేసి, రైతులకు సాగునీరందించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రాయన్‌పల్లి ప్రాజెక్టును పరిశీలించి, మరమ్మతులకు నిధులు మంజూరు చేయించాలని కోరారు.
కలెక్టరేట్ గేట్ ఎదుట పద్మాదేవేందర్‌రెడ్డి చేపట్టిన ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు, రైతులు భారీగా తరలివచ్చారు. మెదక్ మండలంలోని తిమ్మనగర్, మక్త్తభూపతిపూర్, గుట్టకిందిపల్లి, శివాయపల్లి, మల్కాపూర్ తండా, వెంకటాపూర్, కొంటూర్ గ్రామాల రైతులు భారీగా తరలివచ్చారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా, లోనికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో గేటు ఎదుట బైఠాయించారు. చివరకు అధికారుల అనుమతితో ప్రజావాణిలో కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ప్రాజెక్టును పరిశీలించి మరమ్మతులు చేయించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ ఆందోళనలో జడ్పీ మాజీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు బట్టి జగపతి, మల్లికార్జున్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.