రాజోళి, జనవరి 6 : విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా చేనేత కార్మికుడి ఇంటికి రూ.2.78 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. జోగులాంబ గద్వాల జిల్లా రాజోళి మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు మల్లికార్జున 2022 ఏప్రిల్ నెలలో కొత్త మీటర్ తీసుకోగా మే నెలలో రూ.85, జూన్‌లో రూ.75 బిల్లు వచ్చింది. వాటిని అప్పుడే చెల్లించాడు. ఆ తరువాత జూలైలో ఏకంగా రూ.35 వేల బిల్లు వచ్చింది. ఇదేమిటని బాధితుడు ప్రశ్నించగా సాంకేతిక కారణాల వల్ల అలా వచ్చిందని, క్లియర్ చేస్తామని అధికారులు చెప్పడంతో బిల్లు కట్టలేదు. నాటి నుంచి నేటి వరకు నెలనెలా బిల్లు పెరుగుతూనే ఉన్నది.
ఈనెలలో అధికారులు కరెంట్ బిల్లు నమోదు చేయగా ఏకంగా రూ.2,78,500 బిల్లు రావడంతో బాధితుడు కంగుతిన్నాడు. బిల్లు ఇవ్వమంటే అధికారులు ఇవ్వడం లేదు. ఈ విషయమై విద్యుత్తు అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని, 8 నెలలకు రూ.250 చొప్పున రూ.2 వేలు కట్టించుకున్నట్టు మల్లికార్జున తెలిపాడు. మీటర్ మార్చాలని కోరగా.. ‘మహబూబ్‌నగర్‌కు వెళ్లి నువ్వే మార్చుకోవాలి.. మేము రాకూడదు..’ అని సమాధానమిస్తున్నారని చెప్పాడు. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా.. సాంకేతిక లోపాలతో బిల్లు అలా వస్తుందని, ఉన్నతాధికారులకు సమాచారం అందించి పరిష్కరిస్తామని తెలిపారు.