సుల్తాన్‌బజార్, జూన్ 25: పేద ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయశాఖ గావ్ చలో (పల్లెకు పోదాం) కార్యక్రమాన్ని 2004లోనే ప్రారంభించిందని రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ బీఎన్ రావు చెప్పారు. ఐఎంఏ జాతీయశాఖ పిలుపుమేరకు తెలంగాణశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 55 బ్రాంచీల్లో సుమారు 20 వేల మంది సభ్యులు 200 గ్రామాలను దత్తత తీసుకొని ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రారంభించినట్టు తెలిపారు.
హైదరాబాద్ కోఠిలోని ఐఎంఏ ఆడిటోరియంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పల్లెకు పోదాం కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని చెప్పారు. వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, డెర్మటాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్ తదితర విభాగాల వైద్యులు ప్రజలకు వైద్య సేవలను అందిస్తారని వెల్లడించారు.ఇందులో ఐ ఎంఏ పబ్లిక్ హెల్త్ అండ్ కమ్యూనిటీ సర్వీస్ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి విజయ్ తదితరులు పాల్గొన్నారు.