హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30(నమస్తే తెలంగాణ): ‘మిస్టర్ టెన్ పర్సెంట్’ పట్టువీడటం లేదు. తన కమీషన్ తనకు రావలసిందేనని, లేకుంటే కేబుల్ ముచ్చటే వద్దని అధికారులకు తేల్చి చెప్పడంతో ఎస్పీడీసీఎల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే కుదుర్చుకున్న పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లతో మాట్లాడి వారే కేబుల్ సమకూర్చుకునేలా ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రంకనిపించడం లేదు. పనులకు టెండర్లు ఖరారు చేసిన సమయంలో ఉన్న నిబంధనల ప్రకారం దక్షిణ డిస్కం కేబుల్ సమకూర్చాలని, ఒకవేళ తాము స్వయంగా కేబుల్ తెచ్చుకోవాలంటే ఏ రేటులో తెచ్చుకోవాలి.. ఏ క్వాలిటీలో తెచ్చుకోవాలనే విషయం డిస్కం నిర్ణయించాలని, ఒకవేళ ధర ఎక్కువైతే ఎవరు భరిస్తారనే విషయంపై అధికారులకు, కాంట్రాక్టర్లకు మధ్య చర్చ జరిగింది. దీనిపై అధికారులకు కాంట్రాక్టర్లు లేఖలు కూడా రాశారు. కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి.
జూబ్లీ బస్టాండ్‌లో చార్జింగ్ స్టేషన్‌కు సంబంధించి 33 కేవీ కేబుల్ వేస్తే పనులు పూర్తవుతాయి. ‘నమస్తే తెలంగాణ‘లో ‘మిస్టర్ టెన్ పర్సెంట్’ కథనం వచ్చిన తర్వాత జూబ్లీ బస్‌స్టేషన్‌లోని చార్జింగ్ స్టేషన్ పనులను మెట్రో సీఈ, సికింద్రాబాద్ ఎస్ఈలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేబుల్ వేయకపోవడంతో పనులు నిలిచిపోయాయనే వార్తలు రావడంతో ఆర్టీసీ అధికారులను డిస్కం అధికారులు మందలించినట్టు సమాచారం. అయితే తాము కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పనులు జరగట్లేదని, వెంటనే పనులు పూర్తి చేయాలని ఆర్టీసీ అధికారులు కోరినట్టు సమాచారం. దీనిపై మెట్రోజోన్ సీఈతో పాటు ఇతర అధికారులు కేబుల్ లేకుండా పనులు ఎలా చేయాలనే దానిపై చర్చించారు.
ఓవర్‌హెడ్ వేస్తే కేబుల్ అవసరం లేకుండానే పని పూర్తవుతుందనే ఆలోచనకు రావడంతో సంబంధిత కాంట్రాక్టర్‌ను సంప్రదించారు. తనకు కేబుల్ సరఫరా చేయాలని, లేకుంటే ఓవర్‌హెడ్ వేయాలంటే రివైజ్డ్ ఎస్టిమేషన్‌తో అగ్రిమెంట్ చేసుకోవాలని అధికారులకు కాంట్రాక్టర్ తేల్చి చెప్పాడు. ఈ రివైజ్డ్ ఎస్టిమేషన్కు ఆర్టీసీ అంగీకరించాలి, కాబట్టి ఇదంతా ఇప్పట్లో జరిగే పని కాదని అధికారులే చెప్పుకుంటున్నారు. కేబుల్ విషయంలో జరిగిన రభసతో ఏం చేయాలో, పనులు ఎలా పూర్తి చేయాలో అర్థంకాక సతమతమవుతున్నట్టు మెట్రోజోన్ అధికారి ఒకరు తెలిపారు.
స్టోర్స్‌లో కేబుల్ లేదన్న విషయాన్ని అధికారులు బహిరంగంగానే చెప్తున్నారు. తమకు అవసరం లేదు కాబట్టి తాము కొనుగోలు చేయబోమని చేతులెత్తేశారు. ఒకవేళ కొనుగోలు చేయాలంటే ‘మిస్టర్ టెన్ పర్సెంట్’ డిమాండ్‌ను పూర్తిచేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లు ఎవరికి వారే కేబుల్ తెచ్చుకోవాలని చెప్పడంతో కాంట్రాక్టర్లు తమ నిబంధనలను లేఖ రూపంలో అధికారులకు పంపారు. ఇక, విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగకుం డా ప్రత్యామ్నాయంగా చేసే సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులు అత్యవసరం కాదని, వాటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని జీఎం స్థాయి అధికారి ఒకరు తెలిపారు. అయితే, అత్యవసరం కాకుంటే సమ్మర్ యాక్షన్ ప్లాన్ అంటూ మార్చిలోనే ఒప్పందాలు ఎలా కుదుర్చుకున్నారన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఈ ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పడం లేదు. కేబుల్ లేక పనులు ఆగుతున్నప్పటికీ మిస్టర్ టెన్ పర్సెంట్ ముచ్చటే తప్ప, ప్రజా ప్రయోజన పనులపై అధికారులకు సోయి లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.