హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో కీలక అధికారి స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి తప్పుకొనేందుకు సిద్ధమయ్యారు. మొన్నటికి మొన్న ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ ప్రభుత్వ సర్వీసుకు గుడ్ బై చెప్పారు. ప్రభుత్వ ఒత్తిళ్లు, రాజకీయ జోక్యం మితిమీరిన నేపథ్యంలో ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకొన్నారు. రాష్ర్టానికి సీఎస్ అయ్యే అవకాశం ఉండి, నిజాయితీపరుడిగా పేరొందిన రిజ్వీ రాష్ట్ర ప్రభుత్వంలో ఇమడలేక ఉద్యోగమే వదులుకున్నారు. ప్రభుత్వ పెద్దల అవినీతి దందా లు, అక్రమాలు భరించలేక రాజీనామా చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పుడు అదే బాటలో మరో అధికారి పయనిస్తున్నారు.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో ఐఏఎస్ ఉద్యోగానికి ఏమా త్రం తక్కువ కాని పోస్టులో ఉన్న ఆ అధికారి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. ఆర్ అండ్ బీలో ఇటీవల పెడధోరణులు పెరిగిపోవడంతోనే ఆ అధికారి స్వచ్ఛంద రాజీనామా సమర్పించినట్టు ఆ శాఖ వర్గాలు చెప్తున్నాయి. అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న ఆ అధికారి రోడ్లు, భవనాల శాఖలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. అ లాంటి అధికారి తనకు ఆరోగ్యం బాగాలేదని, ఉద్యోగానికి రాలేనంటూ మంత్రికి, ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే, అసలు కారణం మాత్రం ఇక్కడ జరుగుతున్న అక్రమాల నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిదని, లేకపోతే ఆ ఊబిలో తాను కూరుకుపోతానని భయపడుతున్నట్టు తెలిసింది.
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖలో రిటైర్డ్ ఇంజినీర్లను అందలం ఎక్కించడం వివాదాస్పదమవుతున్నది. చరిత్రలో తొలిసారి కాంట్రాక్ట్ పద్ధతిపై సీఈలను కూడా నియమించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ‘హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్)’ రోడ్ల నిర్మాణం, రాష్ట్ర రోడ్ల విభాగం, జాతీయ రహదారుల నిర్మాణాల వి భాగం వంటి వాటికి రిటైర్డ్ ఇంజినీర్లనే ప్రభు త్వం నియమించింది. కీలకమైన ఈ విభాగాలను రిటైరైనవారితో నింపడం ఒక్క ఆర్ అండ్ బీకి మాత్రమే చెల్లిందని చెప్తున్నారు.
ఆర్అండ్బీ శాఖలో రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న ఈఈలకు ఎస్ఈలుగా, ఆ తర్వాత సీఈలుగా ప్రమోషన్లు ఇవ్వడం వెనుక మతలబేంది? అనే చర్చ నడుస్తున్నది. ఇక రిటైరైన పలువురు అధికారులు ప్రభుత్వ పెద్దలతో పైరవీలు చేసుకుని పోస్టుల్లో చేరుతున్నట్టు తెలిసింది. డిమాండ్ ఉన్న ఈ పోస్టుల కేటాయింపులో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నట్టు ఆరోపణలున్నాయి. వారి తీరు పట్ల కింది స్థాయి ఉద్యోగులు ఆందోళనలు సై తం చేపట్టారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్టెన్షన్లు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ఆర్ అండ్ బీ శా ఖలో ఇదేం వైపరీత్యం అంటూ ఇక్కడి ఇంజినీర్లు ప్రభుత్వంలోని పెద్దలకు మొరపెట్టుకున్నారు. వినతిపత్రాలు ఇచ్చిన ప్రభుత్వం తీరు మారలేదు. మొత్తం శాఖ రిటైర్డ్ అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, వీరి పెత్తనం భరించలేకపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు.
రిటైరైన వారికి కీలక విభాగాలు ఇవ్వవద్దంటూ ఉన్నతాధికారులకు గోడు వెళ్లబోసుకు న్నా ఉపయోగంలేకుండా పోయింది. కేవ లం రాజకీయ ఒత్తిడితోనే రిటైర్డ్ అధికారులను నియమించాల్సి వస్తున్నదని, తాము ఏమీ చేయలేమని వారు చేతులెత్తివేసినట్టు తెలిసిం ది. ఒకవేళ ప్రభుత్వం రిటైరైన వారిని తీసుకు న్నా.. ఫోకల్ పాయింట్లలో పెట్టవద్దని, ఇది త ప్పుడు సంకేతాలు పంపుతున్నదని పలువురు ఇంజినీర్లు ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తంచేశారు. అత్యంత అసమర్థులు, అవినీతి పరులను తెచ్చిపెట్టుకొంటే శాఖ పరువు పోతుందని పేర్కొన్నారు.
కీలకమైన సీఈ, ఎస్ఈ స్థాయిల్లో తమకు నచ్చిన రిటైరైనవారిని నియమించడం వల్ల ఆర్ అండ్ బీలో అర్హులైన ఇంజినీర్లకు ప్రమోషన్లు రావడంలేదు. ఈఈల స్థాయిలోనే అనేకమంది రిటైరవుతున్నారు. జీవితంలో ప్రమోషన్ లేకుండా ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తున్నదని పలువురు ఇంజినీర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎస్ఈ, సీఈ పోస్టులను రెగ్యులర్ వారితో భర్తీ చేస్తే కింది వారికి ప్రమోషన్ చానల్ క్లియర్గా ఉంటుందని, దీనివల్ల రిటైరైనవారి స్థానంలో కొత్తవారు వస్తూ ఉంటారని, రెగ్యులర్ (సర్వీసులో ఉన్న) అధికారి ఉంటే భయం, భక్తి ఉంటాయని, అలా కాకుండా రిటైరైనవారిని నియమిస్తే వారికి జవాబుదారీతనం ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. అర్హులైన, సమర్థులైనవారు ఉన్నప్పటికీ ప్రమోషన్లు ఇవ్వడంలేదని చెప్తున్నారు.