హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): జీవో 58, 59 కింద ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించింది. వారం, పది రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి, పట్టాలను మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. శుక్రవారం బీఆరే భవన్లో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్‌తో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. జీవో 58, 59 కింద పేదల ఇండ్ల స్థలాల పంపిణీపై చర్చించింది. ఏ జిల్లాలో ఎన్ని పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయో గుర్తించి, జాబితాను సిద్ధం చేయాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను సబ్ కమిటీ ఆదేశించింది. కలెక్టర్లు రోజువారీగా సమీక్షలు నిర్వహించి, ప్రక్రియ వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. జీవో 58, 59 కింద దరఖాస్తులకు కటాఫ్ గతంలో 2014 ఉండేదని, మరింత మంది పేదలకు లబ్ధి చేకూర్చేందుకు సీఎం కేసీఆర్ ఆ కటాఫ్‌ను 2020కు పెంచారని గుర్తు చేసింది. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
జీవో 58, 59 దరఖాస్తుల గడువు ఆదివారంతో ముగియనున్నది. ఇప్పటికే ఒక దఫా ఇండ్ల పట్టాల పంపిణీ పూర్తి కాగా, రెండో దఫా పట్టాల పంపిణీకి దరఖాస్తులు చేసుకోవాలని సర్కారు సూచిస్తూ, ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 20 వేల వరకు దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది.