హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీకే తమ సంపూర్ణ మద్దతు అని హైదరాబాద్‌లో స్థిరపడిన పలువురు ఆంధ్రాప్రాంత సెటిలర్లు స్పష్టంచేశారు. అధికార మార్పు వద్దు.. కేసీఆర్‌కే ముద్దు అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో పదేండ్లుగా తెలంగాణలో తాగునీరు, కరెంటు సమస్యలు లేవని, శాంతిభద్రతలు చాలా బాగున్నాయని ఆనందం వ్యక్తంచేశారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత స్థిరాస్తుల విలువ భారీగా పెరిగి చాలా మంది కోటీశ్వరులు అయ్యారని, అందరూ హాయిగా, ఆనందంగా జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. దగ్గుమాటి కోటిరెడ్డి నేతృత్వంలో పలువురు సెటిలర్లు హైదరాబాద్‌లో ఆదివారం మంత్రి కేటీఆర్‌ను సత్కరించారు. సెటిలర్ల మద్దతు బీఆర్ఎస్కే అని ప్రకటించా రు. తెలంగాణ ప్రజలు అందరినీ ప్రేమించే గొప్ప మనసు ఉన్నవారని, ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కొందరు కులతత్వాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుత శాంతియుత వాతావరణానికి భంగం వాటిల్లకుండా హైదరాబాద్‌లో సుఖశాంతులతో జీవిస్తున్న సెటిలర్లందరూ బీఆర్ఎస్కే మద్దతు తెలపాలని విజ్ఞప్తిచేశారు.