హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : మెట్రో రవాణా వ్యవస్థ (Metro Train) పేరుకే ఆధునాతనమైనది. ఆచరణలో అన్నీ అతుకుల బొంతలే. రూ.వేల కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నా.. అందుబాటులోకి వచ్చే నాటికి పడే ఆర్థిక భారం మెట్రో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నది. ఓవైపు సాధారణ ప్రజా రవాణా వ్యవస్థ, మరోవైపు వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగడంతో మెట్రో రైల్ వ్యవస్థ ఆశించిన స్థాయిలో జనాలకు చేరవ కావడం లేదు. అత్తెసరు రైడర్షిప్తో దేశీయ మెట్రో వ్యవస్థ బలహీన పడుతున్నాయి. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే హైదరాబాద్లో మెట్రో రైల్ సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందని, ఆ వ్యవస్థ విస్తరణకు నోచుకోలేకపోయిందని ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు బురద జల్లుతున్నది. వాస్తవానికి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు దేశంలోని పలు నగరాల్లో మెట్రో రైల్ వ్యవస్థలు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆదాయ మార్గాలు తగ్గిపోవడం, నిర్వహణ భారం అధికమవడమే ఇందుకు ప్రధాన కారణం.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 నగరాల్లో మెట్రో రైల్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీలో అత్యధికంగా 353 కి.మీ. మెట్రో మార్గాలు ఉన్నాయి. దీని నిర్వహణకు ఏటా రూ.6,640 కోట్లు వెచ్చించాల్సి వస్తున్నది. ఢిల్లీలో నిత్యం 25-30 లక్షల మంది మెట్రో ద్వారా రాకపోకలు సాగిస్తుండంతో ఆ వ్యవస్థ నష్టాల నుంచి బయటపడగలిగింది. ఢిల్లీలో వ్యక్తిగత వాహనాల వినియోగంపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం, తెలంగాణలో మాదిరిగా అక్కడ ‘మహాలక్ష్మి’ లాంటి ఉచిత బస్సు ప్రయాణ పథకాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఢిల్లీ తర్వాత అత్యధిక రద్దీ కలిగిన బెంగళూరు మెట్రో రైల్ వ్యవస్థ 90 కి.మీ. మేర విస్తరించి ఉన్నది. ఈ మెట్రోలో నిత్యం 6.5 నుంచి 7.3 లక్షల మంది ప్రయాణిస్తుండగా, చెన్నై మెట్రోలో 2.8 లక్షలు, హైదరాబాద్ మెట్రోలో 5.6 లక్షలు, పుణే మెట్రోలో 1.5 లక్షలు, కొచ్చి, అహ్మదాబాద్ మెట్రోల్లో 1.2 లక్షలు, లక్నో, నాగ్పూర్ మెట్రోల్లో లక్ష మంది వరకు ప్రయాణిస్తున్నారు.
భారీ నిర్మాణ వ్యయం, అరకొర రెవెన్యూతో దేశంలోని అన్ని మెట్రోలు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. బెంగళూరు మెట్రోకు ఏటా రూ.150 కోట్ల నష్టం వాటిల్లుతుండగా.. ముంబై మెట్రోకు రూ.100 కోట్లు, కోల్కతా రూ.465 కోట్లు, చెన్నై మెట్రోకు రూ.525 కోట్ల నష్టం వాటిల్లుతున్నది. కొత్తగా నిర్మించిన పుణే మెట్రో సైతం రూ.350 కోట్ల నష్టాలతో నెట్టుకొస్తున్నది. హైదరాబాద్ మెట్రోకు ఏటా నిర్వాహణ ఖర్చుల కంటే రూ.625 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తున్నది.
హైదరాబాద్లో మెట్రో రైల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన వెంటనే కొవిడ్ సంక్షోభం కుంగదీసింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాయదుర్గం-ఎయిర్పోర్ట్ మెట్రో మార్గాలను రద్దు చేయడం, మెట్రో బోగీలను పెంచాలనే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోకపోవడం, ప్రయాణికుల రద్దీని పెంచేందుకు బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన ప్రణాళికలను కొనసాగించకపోవడం, ఉన్న ప్రణాళికలను రద్దు చేసి కొత్త మార్గాల పేరిట ఆలైన్మెంట్ను మార్చడం, చార్జీలను పెంచడం, లాస్ట్ మైల్ కనెక్టవిటీపై దృష్టి పెట్టకపోవడం మన మెట్రో రైల్ వ్యవస్థను కుంగదీశాయి.