హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : మావోయిస్టు పార్టీ విప్లవ ద్రోహులకు ప్రజాకోర్టులో ప్రజలే శిక్షిస్తారని ఆ పార్టీ కేంద్ర కమిటీ నాయకత్వం తేల్చి చెప్పింది. ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నతో పాటు వారి అనుచరులను పార్టీ నుంచి బహిషరిస్తున్నట్లు అభయ్ పేరుతో విడుదలైన ఒక లేఖలో తెలిపింది. వారి లొంగుబాటును ‘విప్లవ ద్రోహం’, ‘పార్టీ విచ్ఛిన్నకర చర్య’ ‘విప్లవ ప్రతిఘాతకత’గా అభివర్ణిస్తూ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది. వారు లొంగిపోయే క్రమంలో విప్లవ ప్రజలకు చెందిన 50 తుపాకులను శత్రువుకు అప్పగించిందంటూ ఆరోపించింది.
2011 నుంచి దండకారణ్య విప్లవోద్యమం గడ్డు స్థితి నేపథ్యంలో వ్యక్తివాదం, అహంభావం, తీవ్రమైన పెత్తందారీతనం వంటి అన్యవర్గ ధోరణులు మల్లోజులలో పేరుకుపోయాయని ఆరోపించింది. 2020 డిసెంబర్లో కేంద్ర కమిటీ సమావేశంలో ఆయన ప్రవేశపెట్టిన స్వీయాత్మక విశ్లేషణతో కూడిన పత్రాన్ని తిరసరించినట్టు పేరొన్నది. 2025 మేలో పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు అమరత్వం తర్వాత, కగార్ ప్రతిఘాతక యుద్ధా న్ని ఎదురొనే త్యాగానికి మల్లోజుల సిద్ధపడలేదని తెలిపింది.