హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): దేశంలో మావోయిస్టు ఉద్యమం దాదాపు కనుమరుగు కానున్నది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో కీలకమైన నాయకులను కోల్పోయిన మావోయిస్టు పార్టీ మరికొందరు అగ్రనేతల లొంగుబాటుతో పూర్తిగా దెబ్బతిన్నది. టాప్ కమాండర్లు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఇక చేసేదేమీ లేక మిగిలిన క్యాడర్ అంతా ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలో కలుస్తున్నది. తాజాగా మావోయిస్టు పార్టీ మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ (ఎంఎంసీ) స్పెషల్ జోనల్ కమిటీ ఆయుధాలను విడిచిపెడుతున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
నూతన సంవత్సరం మొదటి తేదీన లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. పూర్తిస్థాయిలో లొంగిపోవడానికి ఫిబ్రవరి 15 వరకు సమయం కావాలని కోరుతూ ఎంఎంసీ అధికార ప్రతినిధి అనంత్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. జనవరి ఒకటి వరకూ తమ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి, ఫిబ్రవరి 15 లోపు లొంగిపోవడానికి తమకు తగిన సమయం ఇవ్వాలని ఎంసీసీ విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలో మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ కూంబింగ్‌లు, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు నిలిపివేయాలని, సైన్యం, పారామిలిటరీ దళాల మోహరింపును పూర్తిగా నిలిపివేయాలని కోరారు. లొంగిపోయే ప్రక్రియలో పాల్గొనే తమ సభ్యులు, నాయకులకు పూర్తి భద్రత కల్పించాలని, వారిపై ఎటువంటి దాడులు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. కాగా, అనంత్ పేరిట లేఖలు విడుద లైన 24 గంటలు తిరగకముందే ఆయన పోలీసులకు లొంగిపోయారు. 10 మంది మావోయిస్టులతో కలిసి ఆయన మహారాష్ట్ర లోని గోండియా జిల్లా దారేక్ష పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఐదు రాష్ర్టాల్లో ఆయనపై రూ కోటి రివార్డు ఉంది.
ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ లేఖ విడుదల చేసిన తరువాత వరుసగా ఆడియో సందేశాలను విడుదల చేశారు. అందులో.. ‘మారుతున్న పరిస్థితులను పరిశీలించి పార్టీ తాతాలికంగా సాయుధ పోరాటాన్ని నిలిపివేసి, ప్రధాన స్రవంతిలోకి వచ్చి ప్రజల్లో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ప్రకారం సోనుదాదా, సతీశ్దాదా, చంద్రన్నతోపాటు మరెందరో సహచరులు ఆయుధాలను వదిలి, ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస పథకాన్ని అంగీకరించారు. అందుకే ఇది లొంగిపోవడం కాదు. ఇది విప్లవానికి, ప్రజలకు ద్రోహం చేయడం ఏమాత్రమూ కాదు. ప్రజల సమస్యలను మరోవిధంగా ముందుకు తీసుకెళ్దాం.
సాయుధ పోరాటాన్ని కొనసాగించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. మనం ఎందరో సహచరులను కోల్పోయాం. ఇంకా ఎవరినీ కోల్పోవాలని కోరుకోవడం లేదు. అందుకే మీరు ఎకడున్నా సాయుధ పోరాటాన్ని తాతాలికంగా నిలిపివేయాలనే నిర్ణయానికి వెంటనే రావాలి. ఒకరినొకరు సంప్రదించడానికి ప్రయత్నించాలి. మనమంతా కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం మంచిది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర అంత సమయం లేదు. చర్చలు, వాదోపవాదాలకు చాలా సమయం ఉంది. ముందుగా మనం అందరం బతికి ఉండాలి. ఈ క్లిష్ట సమయంలో సహనం కోల్పోవద్దు. ప్రతి ఒకరూ ఒంటరిగా లొంగిపోవద్దు. మనమందరం కలిసి చేస్తున్న పని ఇది’ అంటూ ముగించారు.