చేర్యాల, ఆగస్టు 7 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని ఆదివారం భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు ఉదయం నుంచి కురుస్తున్న ముసురును లెక్కచేయకుండా మల్లన్న స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
సుమారు 15 వేల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఏఈవో వైరాగ్యం అంజయ్య తెలిపారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు.