హైదరాబాద్, డిసెంబర్ 25 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ప్రపంచ దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య గ్లోబల్ వార్మింగ్. వాతావరణ కాలుష్యం కారణంగా భూతాపం పెరుగుతున్నదని ఇప్పటివరకూ చదువుకొన్నాం. అయితే, భూతాపం పెరుగడానికి మేఘాలు కూడా పరోక్షంగా కారణమవుతున్నాయని పరిశోధకులు తాజాగా గుర్తించారు.
సోలార్ రేడియేషన్ను తిరిగి రోదసిలోకి పంపించే గుణాన్ని మేఘాలు క్రమంగా కోల్పోతున్నాయని, దీంతో భూతాపం పెరుగుతున్నదని తెలిపారు. రెండు దశాబ్దాల శాటిలైట్ డాటాను విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చినట్టు పేర్కొన్నారు. మేఘాల్లో జరుగుతున్న ఈ మార్పులకు కారణాలను గుర్తించేపనిలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ వివరాలు ‘సైన్స్ అడ్వాన్సెస్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.