హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని వట్టినాగులపల్లిలో ఏడాదిన్నర క్రితం వివాదాస్పద లేఅవుట్లో కరెంటు మీటర్లు ఇచ్చే దందా కొనసాగింది. ‘బిగ్ బ్రదర్’ ఒకరు బినామీ పేర్లపై అందులోని ప్లాట్లను కొనుగో లు చేసినట్టు తెలిసింది. ఆ ప్లాట్లకు కరెంటు మీటర్ కనెక్షన్ తీసుకునేందుకు బినామీ వ్య క్తులు అధికారులను కలిశారు. వివాదాస్పద ప్లాట్లు అయినందున భారీ మొత్తం ఇస్తే తప్ప మీటర్ కనెక్షన్ ఇచ్చేది లేదని ఏడీఈ అంబేద్కర్ తెగేసి చెప్పినట్టు సమాచారం. దీంతో సదరు వ్యక్తులు ‘బిగ్ బ్రదర్’ పేరు చెప్పారు. అయినా ఆయన ఖాతరు చేయకపోవడంతో రేటు మాట్లాడుకొని పని కానిచ్చినట్టు సమాచారం. విషయం బిగ్ బ్రదర్ దాకా వెళ్లడంతో ‘నా పేరు చెప్పినా డబ్బులు డిమాండు చేశా రా?’ అంటూ కన్నెర్రజేశారు. వెంటనే ఏడీఈ అంబేద్కర్‌పై బదిలీ వేటు వేశారు. దీంతో ఏడీఈ వెంటనే గట్టిమంత్రిని కలిసి బదిలీని రద్దు చేయించుకున్నట్టు తెలిసింది. బిగ్ బ్రదర్ వేటును గంటల్లోనే మాఫీ చేయించుకున్న వచ్చానన్న ధీమాతో ఏడీఈ మరింతగా చెలరేగిపోయారని తెలిసింది.
అంబేద్కర్ వద్దకు ఏ ఫైల్ వెళ్లినా అందుకు తగ్గ రేటు లభిస్తేనే అది ముందుకు కదులుతుందన్న ప్రచారం జరుగుతున్నది. గట్టిమంత్రి అండదండలు ఉండటంతో ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎవరూ ముట్టుకునే సాహసం చేయలేదు. ఈ పోస్టులోకి రావడానికి కోట్లు కుమ్మరించానని, తన ఫిక్స్డ్ రేట్లకు అదే కారణమని ఆయన చెప్తారట. బినామీగా ఉన్న ఓ కాంట్రాక్టర్‌ను ఏర్పాటు చేసుకొని పనులు చేయిస్తారని డిస్కంలో చెప్పుకుంటున్నారు. ప్రతి నెలా ఎన్ని ఫైల్స్ చేశామో చెప్పి అందులో ‘పై’ స్థాయికి కూడా వాటా పంపుతారని, ఆ ధీమాతోనే అంబేద్కర్ ఉన్నతాధికారులను ఖాతరు చేయకపోయేవారని ఉద్యోగులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
గతంలో బిగ్ బ్రదర్‌కు ఝలక్ ఇచ్చిన అంబేద్కర్ ఇటీవల ఏకంగా ‘ముఖ్య’ నేత కు సైతం మరో ఝలక్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ‘ముఖ్యనేత’ క్లోజ్ సర్కిల్లోని ఓ వ్యక్తికి కోకాపేట ప్రాంతంలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనానికి హెచ్‌టీ కనెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలో పేషీ నుంచి ఏడీఈకి ఫోన్ వెళ్లింది. ఆ పని చేయాలని సూచన వెళ్లగా అప్పటికి అంబేద్కర్ సరేనన్నట్టు తెలిసింది. కానీ, సదరు వ్యక్తికి సంబంధించిన వాళ్లు వెళ్లి కలవగా రూ.50 లక్షలు డిమాండు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. కొన్నిరోజులకు ఈ విషయం ‘ముఖ్య’ కేంద్రానికి చేరడంతో పర్యవసానంగా ఏసీబీ దాడి జరిగిందని అధికారుల మధ్య చర్చ జరుగుతున్నది.