హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకు వెళ్లినప్పుడు ఆ రాష్ట్రప్రభుత్వం తగిన రీతిలో గౌరవించకపోవడం ప్రజాస్వామ్య విలువలను పాతరేయడమేనని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. ఈ విషయంలో సీజేఐ జస్టిస్ గవాయ్ మానసిక వేదనకు గురయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగంలో ప్రధానమైన న్యాయవ్యవస్థపై మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నదని మండిపడ్డారు.
శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు రా జ్యాంగంలో ప్రధాన అంశాలుగా పిలవబడుతాయని.. అవి పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం కూ డా రాష్ట్రాలకు తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. గుల్జార్‌హౌస్ ఘటనలో 17మంది మృత్యువాత పడ డం తనను తీవ్రంగా కలచి వేసిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.