ఆ భూముల్లో జింకలు, పులులు, సింహాలు జీవరాశులేం లేవు. కొన్ని గుంటనక్కలు అక్కడ చేరి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి.
-అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
అసలైన అడవిలోనే జింకలు లేవు. కంచ గచ్చిబౌలి భూముల్లో జింకలు ఉన్నాయంటున్న వాళ్లు ప్రాపర్‌గా చదువుకొన్న వాళ్లేనా? లేకుంటే భ్రమల్లో బతుకుతున్నారా?
-ఢిల్లీ మీడియాతో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
Congress Govt | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ : ‘అబద్ధం చెప్పినా అతికినట్టుండాలె!’ అంటారు పెద్దలు! కానీ హెచ్‌సీయూ భూముల విషయంలో రేవంత్ సర్కారు ఆడిన.. ఆడుతున్న అబద్ధాలు చూస్తుంటే ఆ అబద్ధమే సిగ్గుపడేలా ఉన్నాయి! ఉన్నపళంగా రాత్రికిరాత్రే వర్సిటీ భూములపై వందలాది బుల్డోజర్లతో దండయాత్ర చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తీవ్ర విమర్శలు రావడం, పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు ఉద్యమాన్ని ఉధృతం చేయడంతో అసలవి హెచ్‌సీయూ భూములే కావని బుకాయించింది. ‘చెట్లు పెరిగినంత మాత్రా న అడవి అయితదా?.. అక్కడ జింకలు ఎక్కడున్నయి? నెమళ్లు ఎక్కడంటె అక్కడుంటయి’ అంటూ హేళన చేసింది. వందకు పైగా ఎకరాల్లో చెట్లను కూలగొట్టడంతో ఏకంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని పనులను ఆపి వేయించింది. అసలు అది అడవే కాదన్న ప్రభుత్వం ఇప్పుడు కొత్త పాట అందుకున్నది.
2వేల ఎకరాల్లో ఎకో పార్కు ఏర్పాటు చేయిస్తామని బాకా పత్రికలకు లీకులిచ్చి కథనాలు రాయించుకున్నది. ఈ క్రమంలో కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు అక్కడ వివాదం మొదలైందే చెట్లను కూల్చివేయడంపైన! వందల ఎకరాల్లో అడవిని ధ్వంసం చేసి అరుదైన చెట్లు, గడ్డి జాతులు, వన్యప్రాణుల ఉనికిని ప్రమాదంలో పడేయడం పైన! మరి ఇప్పుడు మరి సర్కారు సాగించిన ఈ విధ్వంసానికి ఇప్పుడు పాడుతున్న ‘ఎకో పార్కు’ పాటకు పొంతన ఎక్కడిది? గురువారం మధ్యాహ్నం హెచ్‌సీయూ భూముల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఆ 400 ఎకరాల భూములను ఎవరూ కొనొద్దని, మూడేండ్ల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక అక్కడ దేశంలోనే అతిపెద్ద ఎకో పార్కును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కేటీఆర్ మాటతో కాంగ్రెస్ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అటు సుప్రీంకోర్టు అక్షింతలు, ఇటు కేటీఆర్ ప్రకటనతో బెంబేలెత్తి తాము కూడా ఎకో పార్కు కోసమే ఇదంతా చేస్తున్నట్టు బుకాయించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా బాకా పత్రికలకు లీకులు ఇచ్చి ‘2 వేల ఎకరాల్లో ఎకో పార్కు ఏర్పాటు’ అంటూ కథనాలను వండి వార్పించారు. దీంతో ప్రభుత్వం, బాకా పత్రికలు ప్రజల్లో నవ్వుల పాలయ్యాయి.
అది అడవే కాదన్నరు. అక్కడ జింకలే లేవన్నరు. విధ్వంసం సృష్టించిండ్రు. పచ్చని చెట్లను నేలకూల్చిండ్రు. ఇన్నాళ్లూ ఆ పచ్చని చెట్ల మధ్య, ఆ దట్టమైన అడవిలో స్వేచ్ఛగా విహరించిన వన్యప్రాణులు నిలువ నీడ కోల్పోయాయి. దిక్కుతోచని స్థితిలో, కాస్తంత నీడను వెతుక్కుంటూ దారితప్పి బయటకొస్తున్నాయి. ఇదిగో.. శుక్రవారం అలా గోపనపల్లిలోని ఓ ఇంటిలోకి వచ్చిందే ఈ జింక! అది అడవో కాదో.. అక్కడ జింకలున్నాయో.. లేవో? అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క దశ్యం చాలదా?
అదిగో.. ఈ చిత్రంలో దూరంగా కనిపిస్తున్నది కాంక్రీట్ జంగిల్.. దానిని ఆనుకొని చిట్టడవిలా.. ఏపుగా పెరిగిన మహావృక్షాలు.. ఎన్నో రకాల వన్యప్రాణులకు, ఔషధ మొక్కలకు నెలవైన ప్రాంతం. అదే హైదరాబాద్ మహానగరానికి లంగ్ స్పేస్! అందులోనే సహజసిద్ధమైన నీటి కొలను. దానికి ఇవతల కనిపిస్తున్నదే రేవంత్ సర్కారు సాగించిన విధ్వంస కాండతో ఎడారిలా మారిన ప్రాంతం.
ఇది రేవంత్ సర్కారు అత్యంత అమానుషంగా, మూర్ఖంగా సాగించిన విధ్వంసకాండపై ఒక మచ్చలజింక ఇచ్చిన మరణవాంగ్మూలం! ఇన్నాళ్లూ తమకు నీడనిచ్చిన అడవి మాయమవ్వడంతో అక్కడ బతికేదారిలేక, మరో కొత్త ఆవాసాన్ని వెదుక్కుంటూ హెచ్‌సీయూ క్యాంపస్‌లోకి వచ్చిందీ జింక. పాపం.. ధ్వంసమైన అడవిని దాటి బయటకు రావడమే ఆలస్యం.. కుక్కల గుంపు దాడిలో తీవ్రంగా గాయపడింది. అది గమనించిన విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది దానిని దవాఖానకు తరలించారు. ఒకవైపు తన గూడు చెదిరిపోయిందన్న మానసిక వేదన.. మరోవైపు కుక్కల దాడి తాలూకు గాయాల బాధ.. తట్టుకోలేకపోయింది. ప్రాణం విడిచింది. ఇంతకు మించి ఒక మూగజీవి ఇంకే మరణవాంగ్మూలం ఇవ్వగలదు?
అసెంబ్లీ వేదిక మొదలు సెంట్రల్ యూనివర్సిటీ వరకు.. ముఖ్యమంత్రి నుంచి కాంగ్రెస్ కార్యకర్తల దాకా ‘అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావు.. ప్రభుత్వానివే! తెగ నమ్ముకుంటం మీకేంది?’ అని కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించారు. ఉన్నపళంగా భూములపై పడి పచ్చని చెట్లను నేలకూల్చారు. మూగజీవాలను చెల్లాచెదురు చేశారు. అమాయక విద్యార్థులను చావబాది కేసులు పెట్టారు. బీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేసి విద్యార్థుల పోరాటానికి రాజకీయ రంగు పులిమారు. హెచ్‌సీయూ భూములు అమ్మితే తప్ప ఆర్థికంగా సర్కారు అడుగు ముందుకు వేయని దుస్థితి వల్లే సరస్వతి నిలయంలోకి బుల్డోజర్లతో దండయాత్రకు ఒడిగట్టినట్టు స్పష్టమవుతున్నది. కానీ సర్కారు పెద్దలు ఊహించనిరీతిలో సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం రంగంలోకి దిగింది. ఏకంగా హైకోర్టు రిజిస్ట్రార్‌తో నివేదిక తెప్పించుకొని సర్కారు తీరుపై కన్నెర్రజేసింది.
ఇక ఒక్క చెట్టు నేలరాలినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. దీంతో రేవంత్ సర్కారుకు దిమ్మతిరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహం బెడిసికొట్టింది. ‘మేము అధికారంలోకి రాగానే ఆ భూముల్లో ఎకో పార్కును ఏర్పాటు చేస్తాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే సర్కారు ఎకో పార్కు పాటను అందుకున్నది. బాకా పత్రికలకు లీకులిచ్చి 2వేల ఎకరాల్లో ప్రపంచంలోనే అతి పెద్ద ఎకో పార్కును ఏర్పాటు చేసే దిశగా మంత్రుల కమిటీ యోచిస్తున్నందంటూ కథనాలు వండి వార్చింది. తమను భంగపాటుకు గురి చేసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీనే కబళించి ఫ్యూచర్ సిటీకి తరలించాలనే మరో కుట్రను బహిర్గతం చేసింది.
నిజంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి అక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద ఎకో పార్కును అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనే ఉంటే టీజీఐఐసీ ద్వారా ఆ భూములను తనఖా పెట్టి రూ.10వేల కోట్ల రుణాన్ని ఎందుకు తెచ్చినట్టు? అది చాలదన్నట్లు.. రూ.30వేల కోట్లకు ఆ భూములను అమ్మేందుకు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చినట్టు? పైగా వారం రోజులుగా ఇంత రాద్దాంతం ఎందుకు చేసినట్టు? ఏడాదిన్నరలో అభివృద్ధి పనులకు తట్టెడు పని చేయని రాష్ట్ర ప్రభుత్వం, రాత్రిపూట వందల సంఖ్యలో బుల్డోజర్లతో అడవిని ఎందుకు ధ్వంసం చేసినట్టు? 400 ఎకరాలను అమ్మి సొమ్ము చేసుకోవడమే తప్ప ప్రభుత్వ పెద్దల పుర్రెల్లో పర్యావరణాన్ని ఉద్ధరించాలనే సదుద్దేశం లేదనేది లోకమంతా తెలిసిన సత్యం.
సెంట్రల్ యూనివర్సిటీ భూముల తాకట్టుతో వచ్చిన రూ.10 వేల కోట్ల రుణంతో రైతులకు రైతుభరోసా ఇవ్వాలని తొలుత ప్రభుత్వం భావించినట్టు బాకా పత్రికల్లోనే రోజుల తరబడి వార్తలు వచ్చాయి. తీరా రుణం వచ్చిన తర్వాత రైతుభరోసాకే భరోసా లేకుండా పోయింది. సర్కారు వర్గాల్లోనే వినిపిస్తున్న గుసగుసల మేరకైతే రూ.10 వేల కోట్లను రైతుభరోసా కోసం కాకుండా కొందరు మంత్రులు కాంట్రాక్టు బిల్లులకు మళ్లించారు. ఈ క్రమంలోనే 20-30 శాతం కమీషన్లు అంటూ కాంట్రాక్టర్లతో సహా లోకం కోడైకూసింది. అందుకే ఇప్పటిదాకా కనీసం ఐదెకరాలకు కూడా ప్రభుత్వం రైతుభరోసా ఇవ్వలేకపోయింది.
రాష్ట్రంలో రియల్-నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. సర్కారు విధానాలతో ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పడిపోయింది. వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీల అమలు ముందుకుపోక.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో తాకట్టు భూములను తెగ నమ్ముకొని రూ.30 వేల కోట్లు తెచ్చుకుంటే తప్ప ఊపిరాడదని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. తాకట్టు రుణ ఒప్పందంలోనే అమ్మేందుకు వెసులుబాటు ఉన్నందున టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాల విక్రయానికి రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు భూములను అమ్ముతున్నట్టుగా టీజీఐఐసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు నిరసన బాట పట్టారు. ప్రధానంగా గత నెల 13 నుంచి తమ ఆందోళనలను ఉధృతం చేశారు.
సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమ బాట పట్టి వర్సిటీ భూములను అమ్మొద్దంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ వారి ఆందోళనలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీనికి తోడు సామాజిక మాద్యమాల్లోనూ ఆందోళన వేడి ఎక్కువైంది. జీవ వైవిద్యానికి నెలవైన ఆ భూములను కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు, మేధావులు సైతం విద్యార్థులతో కలిసి పోరాటం చేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలు తలోమాట మాట్లాడుతూ విద్యార్థుల ఆందోళనలను అపహాస్యం చేశారు. సాక్షాత్తూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ‘ఆ 400 ఎకరాల్లో ఏ జంతువూ లేదు.. గుంట నక్కలు చేరి రాద్ధాంతం చేస్తున్నరు’ అంటూ విద్యార్థులను అవమానించేలా మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థుల ఫొటోలు, డాక్యుమెంటరీలను సైతం తప్పుబడుతూ అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన ఫేక్ చిత్రాలు అంటూ హేళనచేశారు. ఇతర మంత్రులు, కాంగ్రెస్ నేతలు తలోరీతిన అక్కడ చెట్లు లేవు.. మూగజీవాలు లేవు.. అంటూ ఇష్టానుసారంగా మాట్లాడారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి పరిధిలోని సర్వే నంబర్ 25లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం చంద్రబాబు ఐఎంజీ భారత్‌కు అగ్గువకు కట్టబెట్టారు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నది. ఐఎంజీ భారత్ కోర్టుకు వెళ్లగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆ కేసులో సమర్థవంతమైన వాదనలు వినిపించింది. ఫలితంగా నిరుడు మార్చిలో ఆ భూములు ప్రభుత్వానివేనని కోర్టు తీర్పు ఇచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో సర్కారుకు ఆదాయం పడిపోయింది. హామీల అమలు సాధ్యం కాని సర్కారుకు ఈ భూములు హాట్‌కేకుల్లా కనిపించాయి. నిరుడు ఈ 400 ఎకరాల భూమిని వెంటనే టీజీఐఐసీకి బదిలీ చేసి తనఖా పెట్టి రూ.10 వేల కోట్ల రుణాన్ని తీసుకున్నారు. ఐసీఐసీఐ కన్సార్టియం బ్యాంకులు ఈ రుణాన్ని ఇచ్చేందుకుగాను టీజీఐఐసీకి ప్రభుత్వమే పూచీకత్తు ఇచ్చేందుకు నిరుడు అక్టోబర్ 26న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. రుణ ఒప్పందంలోనే తదనంతరం భూములను అమ్మినట్టయితే రూ.10 వేల కోట్లు తిరిగి చెల్లిస్తామనే వెసులుబాటును కూడా చేర్చారు.
సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు వారం రోజులుగా తమ ఆందోళనలను ఉధృతం చేయడంతో ఎలాగైనా భూములను అమ్మాలని నిర్ణయించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. ఏడాదిన్నరగా తెలంగాణలో బుల్డోజర్-పోలీసు న్యాయాన్ని మాత్రమే నమ్ముకొన్నందున ఇక్కడ కూడా అదే తంత్రాన్ని అమలు చేసింది. పోలీసులతో విద్యార్థులను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లి అరెస్టులు చేసింది. వారి నిరసన కార్యక్రమాలను నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. అప్పటికే హైకోర్టులో తమకు గడువు కావాలంటూ కోరిన ప్రభుత్వం ఈలోగానే అడవిని అంతం చేసే దుస్సాహసానికి ఒడిగట్టింది. అందులో భాగంగానే రాత్రిపూట వందల సంఖ్యలో బుల్డోజర్లను మోహరించి వందల ఎకరాల్లో చెట్లను నరికివేయడంతో అరుదైన మొక్కలు, వృక్షాలు నేలకొరిగాయి. మూగజీవాలు గూడు చెదిరి కొన్ని మృత్యువాతపడితే మరికొన్ని జనారణ్యంలోకి వస్తున్నాయి. చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని నిలువరిస్తే తప్ప రేవంత్ సర్కారు అడవిని అంతం చేసే ప్రక్రియను నిలిపివేయలేదు.
హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాహుల్‌గాంధీ చేతికి రక్తపు మరక అంటిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. హెచ్‌సీయూలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విధ్వంసానికి శుక్రవారం ఓ జింకపై కుక్కల గుంపు దాడి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కంచ గచ్చిబౌలి మినీఫారెస్ట్ను బుద్ధిహీనంగా నాశనం చేయడం వల్ల విలువైన వృక్ష, జంతు జాలం తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు.
సెంట్రల్ యూనివర్సిటీలో సర్కారు విధ్వంసానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టడంతో ప్రభుత్వ పెద్దలకు దిమ్మతిరిగి పోయింది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ముందుకొచ్చి ‘ఆ 400 ఎకరాలను అధికారంలోకి రాగానే ఎకో పార్కుగా తీర్చిదిద్దుతాం’ అని ప్రకటించారు. ఆ భూములను ప్రభుత్వం అమ్మితే తాము ఇంచు భూమితో సహా తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో భూములమ్మి రూ.30వేల కోట్లు తెచ్చుకొని ‘సంతృప్తి’ చెందాలనే ప్రభుత్వ పెద్దల కల ఒక్కసారిగా చెదిరిపోయింది.
పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే పచ్చదనాన్ని హరించివేస్తున్నదంటూ జాతీయ స్థాయిలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వచ్చింది. అందుకే ఇక తమ వ్యూహం బెడిసికొట్టిందని తత్వం బోధపడి నష్టనివారణ చర్యలకు దిగింది. కేటీఆర్ ప్రకటన తర్వాత గంటల వ్యవధిలోనే సమాలోచనలు చేసుకొని తమ బాకా పత్రికలకు లీకులిచ్చింది. కేవలం 400 ఎకరాల్లోనే కాదు.. మిగిలిన భూమిని సైతం ప్రపంచంలోనే అతి పెద్ద ఎకో పార్కుగా తీర్చిదిద్దే యోచన చేస్తున్నామంటూ రాయించుకున్నారు. పనిలో పనిగా సెంట్రల్ యూనివర్సిటీని అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీకి తరలించనున్నామనే మరో కుట్రను సైతం నెమ్మదిగా జనంలోకి వదిలారు.
అసలు సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను అమ్ముతామని ప్రభుత్వమే ప్రకటించింది. కానీ జాతీయ స్థాయిలో అభాసుపాలై, వ్యూహం బెడిసికొట్టిన తర్వాత ఇప్పుడు ఎకో పార్కు మంత్రాన్ని జపిస్తున్నది. వాస్తవానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఈ భూములను అమ్మితే తప్ప ఆర్థికంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి నెలకొన్నదని అధికారికవర్గాలే చెప్తున్నాయి. అసలు ఎక్కడా అప్పు పుట్టడంలేదు.. ఎవరూ నమ్మడంలేదని స్వయానా సీఎం రేవంత్‌రెడ్డి రవీంద్రభారతిలో వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనమని గుర్తుచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో 400 ఎకరాల్లో భాగంగా ఫార్మా, రియల్ రంగానికి చెందిన ఒక ప్రముఖ కంపెనీకి సుమారు 150 ఎకరాలను విక్రయించేందుకు గతంలోనే ప్రభుత్వ పెద్దల స్థాయిలో అంతర్గత చర్చలు ‘విజయవంతంగా’ పూర్తయినట్టు ప్రచారంలో ఉన్నది. ఇలా స్వామికార్యం.. స్వకార్యం.. రెండూ నెరవేరుతాయనే లక్ష్యంతోనే 400 ఎకరాల విక్రయానికి ప్రభుత్వం దూకుడుగా ముందుకుపోయిందని అధికారులే అంటున్నారు. కాకపోతే ఇప్పుడు చేసేదిలేక ఎకో పార్కును అభివృద్ధి చేస్తామంటూ కొన్ని పత్రికల్లో కథనాలు రాయించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.