హైదరాబాద్ జూన్ 2 (నమస్తేతెలంగాణ): ఈనాడైనా మరేనాడైన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు రక్షణ కవచమని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఉద్ఘాటించారు. కేసీఆర్ ఆత్మవిశ్వాసంతో సాగించిన అసమాన పోరాటంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని చెప్పారు. ఉద్యమనేతగా, పాలనాదక్షుడిగా నాలుగుకోట్ల ప్రజల హృదయాల్లో కొలువుదీరిన గొప్పవ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, విప్ కేపీ వివేకానంద ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలవేశారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు.
చరిత్రలో జూన్ 2 సువర్ణాక్షరాలతో లిఖించిన రోజని.. ఇందుకు కర్త, కర్మ, క్రియ కేసీఆరేనని స్పష్టం చేశారు. అన్నివర్గాలను కలుపుకొని తెలంగాణను సాధించిన కేసీఆర్.. పాలనాదక్షతతో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. తెలంగాణ వనరులు, ప్రజల అవసరాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు కేసీఆరేనని స్పష్టంచేశారు. జై తెలంగాణ నినాదమే ఆయుధంగా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి స్వరాష్ట్ర కలను నిజం చేశారని పేర్కొన్నారు. అద్భుత వ్యూహరచన ఆయన సొంతమని మధుసూదనాచారి ప్రశంసించారు. అలవికానీ హామీలిచ్చి..100 రోజుల్లోనే అమలు చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పతనం.. అప్పుడే ప్రారంభమైందని విమర్శించారు. ఆరు నెలల్లోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం దేశంలో ఇదేనని చెప్పారు. ఈ తరుణంలో ప్రజలు మళ్లీ కేసీఆర్‌వైపు చూస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఆలోచనాతోనే రాష్ట్రం: వినోద్
కేసీఆర్ ఆలోచనా విధానంతోనే తెలంగాణ కల సాకారమైందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3ని ఆకలింపు చేసుకొని ప్రజాస్వామిక పంథాలో 32 రాజకీయ పార్టీలను ఒప్పించి రాష్ట్రాన్ని తీసుకొచ్చామని తెలిపారు. 2014లో పురుడు పోసుకున్న తెలంగాణ బిడ్డ కేసీఆర్ నాయకత్వంలో అన్నింటా ముందు నిలిచిందని కొనియాడారు. ప్రస్తుతం దురదృష్టవశాత్తు రాష్ట్రం దుర్మార్గుల చేతుల్లో చిక్కుకున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. మళ్లీ మనం అప్రమత్తం కావాల్సిన తరుణం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనను తిరిగి తెచ్చుకోవాల్సిన చారిత్రక అవసరమున్నదని నొక్కిచెప్పారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు నిర్విరామంగా శ్రమించాలని ఉద్బోధించారు.
అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ సిద్ధించిందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. కేసీఆర్ ఆలోచనా విధానంతో రూపుదిద్దుకున్న రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని చెప్పారు. తెలంగాణ కోసం ఉస్మానియా గడ్డపై సిరిపురం యాదయ్య, ఇషాన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి త్యాగాలకు తాను ప్రత్యక్ష్య సాక్షినని చెప్పారు. కేసీఆర్ ఏర్పాటుచేసిన గురుకులాల్లో వారి పిల్లలను చదివించే అదృష్టాన్ని, కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ ముందు నిలిచే భాగ్యాన్ని, కేసీఆర్ స్థాపించిన మెడికల్ కాలేజీలో చదువుకొనే అవకాశాలను, ప్రపంచ ఇంజినీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టును, ఆ నీళ్ల ద్వారా మొలకెత్తిన విత్తనాలను తినే అవకాశాలను కోల్పోయిన అమరులు మనకు అదృష్టాన్ని ఇచ్చి వెళ్లిపోయారని ఉద్ఘాటించారు.
పన్నెండేండ్ల క్రితం ఆవిర్భవించి.. కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా రూపుదిద్దుకున్న తెలంగాణ ఇప్పుడు కౌరవుల చేతిలో బందీగా మారిందని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కారు దురాగాతాలతో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చెప్పారు. రాబోయే మూడేండ్లలో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఇందుకోసం పార్టీ నాయకులు అలుపెరగని కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని కొందరు కుట్రలు చేస్తున్నారని, కానీ, సూర్యచంద్రులు ఉన్నంతకాలం కేసీఆర్ గురుతులను వారు తొలగించలేరని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తేల్చి చెప్పారు. ఆయన నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని అభివర్ణించారు. కేసీఆర్ మళ్లీ తిరిగి ముఖ్యమంత్రి కావడం.. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందడం ఖాయమని మైనార్టీ నాయకుడు సలీం ధీమా వ్యక్తంచేశారు. ఓ సిద్ధాంతం, ఆశయం కోసం తపిస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు రవీందర్రావు, దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా, వై సతీశ్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, తుల ఉమ, దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్, నేతలు శుభప్రద్ పటేల్, కిశోర్‌గౌడ్, సుమిత్రా ఆనంద్తనోబా, గజ్జెల నగేశ్, బాలరాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ పాలనలో నాడు దేశానికే దిక్సూచిగా నిలిచి తెలంగాణ రాష్ట్రం.. ఇప్పుడు దురదృష్టవశాత్తు అసమర్థుల చేతుల్లోకి వెళ్లిందని ఎమ్మెల్సీ వాణీదేవి ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన యువకులు, మహిళలకు ఆమె జోహార్లు అర్పించారు. 1969 పోరాటం విఫలమైన పరిస్థితుల్లో ఇక తెలంగాణ రాదేమోనని నిరాశకు గురయ్యామన్నారు. కానీ కేసీఆర్ అసమాన పోరాటంతో రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు. మనమందరం మొక్కవోని దీక్షతో ముందుకు సాగి తిరిగి తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
తెలంగాణ భవన్లో రాష్ర్టావిర్భావ సంబురాలు సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో భవన్ ప్రాంగణం ప్రతిధ్వనించింది. పార్టీ కార్యాలయాన్ని గులాబీ తోరణాలతో అలంకరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి గులాబీ శ్రేణులు తరలివచ్చాయి. డప్పు చప్పుళ్ల నడుమ తెలంగాణ సంప్రదాయ నృత్యాలతో ర్యాలీలుగా తరలివచ్చారు. భవనం ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. పలువురు నాయకులు స్వీట్లు పంచిపెట్టారు. కళాకారులు ఆటపాటలతో అలరించారు. ర్యాలీని అనుసరించిన గుర్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ భవన్లో కార్యకర్తల నడుమ భారీ కేక్ కట్ చేశారు.