ఎడమ పక్కనున్న రెండు చిత్రాలను చూస్తే మీకు ఏమనిపిస్తున్నది? కడుపులో దేవడం లేదూ..! మన తెలంగాణ మళ్లీ 20 ఏండ్ల క్రితానికి వెళ్లిపోయినట్టు కనిపించడం లేదూ..! ఏడాది క్రితం దాకా భవితమీద భయం లేకుండా బతికిన సామాన్యుడు మళ్లీ బేజారై పోవడం లేదూ..!!
ఇవి కదా.. మన చట్టసభల్లో చర్చకు రావాల్సిన ప్రస్తావనలు. వీటికి కదా మన ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన సందర్భాలు..
అటు సాగునీటి కొరత, ఇటు తాగునీటి కోత.. వ్యవసాయం సతమతం, ఆర్థికం అతలాకుతలం.. రైతన్నల ఆత్మహత్యలు, సబ్బండ వర్గాల సంవేదనలు.. నేడు మొత్తం తెలంగాణ సమాజమే ఒక రకమైన సంక్షుభితమైన వాతావరణంతో కుతకుతలాడుతున్నది. ఊపిరి పీల్చుకునే ఉపా యం కోసం దిక్కు తోచక నలుదిక్కులా వెతుకుతున్నది.
పరమపవిత్రమైన, అత్యున్నతమైన, గౌరవప్రదమైన మన చట్టసభల్లో సభ్యులు చేసే చర్చల నుంచైనా ప్రభుత్వం ఉపశమనమో ఊరటో చూపిస్తుందని ఎదురుచూసింది. సమస్యలకు పరిష్కారమో, ప్రత్యామ్నాయమో ప్రతిపాదించి ఆదుకోవాలని ఆరాటపడ్డది.
ఘనత వహించిన ప్రభుత్వం, చట్ట సభల చర్చల నుంచి పాఠాలు నేర్చుకొని బాట మార్చుకుంటుందని, బతుకు భయం నుంచి విముక్తి కలిగించి భరోసా ఇస్తుందని ఆశ పడ్డది.
కానీ, వారి ఆశలు అడియాశలే అవుతున్నాయా? రాజ్యాంగ సంస్థలైన చట్ట సభల్ని కూడా అధికార పక్షం చివరికి రాజకీయ క్రీడకు, అసత్యప్రచారానికి వేదికగా మార్చిందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టసభల్ని నడిపిస్తున్న తీరుపై మేధావులు, బుద్ధిజీవులు, విద్యావంతులు, సీనియర్ పాత్రికేయుల నుంచి పెదవి విరుపే కనిపిస్తున్నది.
ప్రజలకు, ప్రతిపక్షాలకు జవాబుదారీగా ఉండి సమస్యలను గుర్తించడానికి, పరిష్కరించడానికి బదులు ప్రభుత్వం కేవలం ఎదురుదాడిని, అసత్య ప్రచారాన్ని నమ్ముకొని సబ్బండ వర్గాలను నిరాశపర్చడమే కాదు, శాసనసభ సాక్షిగా రాజ్యంగ విలువల విధ్వంసానికి దిగుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజాస్వామ్యం కేవలం ప్రభుత్వ రూపం కాదు. అది ప్రాథమికంగా తోటివారితో అనుబంధాన్ని కలిగి ఉండటం, సంయుక్తంగా సమాచారాన్ని పంచుకోవడం, సహచరుల పట్ల గౌరవం, పూజ్యభావం కలిగి ఉండటం.
– రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్
సహనం, మర్యాద, సభ్యత, వినయం అనేవి లేకుండా పార్లమెంటరీ రాజకీయాలను ఆచరించడం అసాధ్యం.
– అమెరికాకు చెందిన ప్రముఖ రాజనీతి సిద్ధాంతకర్త థామస్ పైన్
Congress Govt | హైదరాబాద్, మార్చి 24 ( నమస్తే తెలంగాణ): శాసనసభ.. కోట్లాది రాష్ట్ర ప్రజల తలరాతను మార్చే అద్భుతమైన వేదిక. రాష్ట్ర వర్తమానాన్ని, రాష్ట్ర గతిని, తరాల భవిష్యత్తును నిర్ణయించే అతిపెద్ద వ్యవస్థ. అందుకే రాష్ట్ర ప్రజలంతా ఆశగా అసెంబ్లీ సమావేశాల వైపు చూస్తుంటారు. మీడియాలోనూ అసెంబ్లీకి సంబంధించిన అంశాలు పెద్ద ఎత్తున ప్రసారమవుతుంటాయి. సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ వీరవిహారం చేస్తున్న ఈ సమయంలో కూడా ప్రజలు శాసనసభ చర్చలను ఆసక్తిగా గమనిస్తారు. అధికార, విపక్షాల మధ్య అర్థవంతమైన చర్చ జరుగుతుందని, అంకెలు, వాస్తవాల ఆధారంగా పాల నుంచి మీగడ వేరు చేసినట్టు వాస్తవాలు బయటికి వస్తాయని నమ్ముతుంటారు.
గణాంకాలకు, ఆధారాలకు పార్టీలు తమదైన భాష్యం చెప్పవచ్చేమో గాని, వాటిని మార్చలేరని, నిలువెత్తు నిజాలు శాసనసభలో ఆవిష్కృతం అవుతాయని ప్రజలు భావిస్తున్నారు. అందుకే చట్ట సభల్లో ఇచ్చే వివరాలకు, వివరణలకు, చెప్పే మాటలకు, ఇచ్చే హామీలకు, చేసే ప్రకటనలకు శాసనాల మాదిరి ప్రాశస్త్యం ఉంటుంది. ఇంత గొప్ప శాసనసభ వేదికపై ఈ మధ్య కొందరి ప్రవర్తన ఎబ్బెట్టుగా మారిందని, అబద్ధాలకు, అసత్య ప్రచారాలకు దీనిని వేదికగా మార్చుకుంటున్నారని అటు ప్రజలు, ఇటు రాజకీయ విశ్లేషకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చట్టసభల్లో చెప్పే ప్రతి మాట వాస్తవమనే భావనకు తూట్లు పొడుస్తున్నారని వాపోతున్నారు. పరమ పవిత్రమైన శాసనసభ సాక్షిగా కొందరు నాయకులు.. ప్రజాస్వామిక విలువలు, శాసన ప్రమాణాల విధ్వంసానికి ఒడిగడుతున్నారని, అయినా, దీన్ని ఎవరూ అడ్డుకోలేక పోతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇందుకు అనేక ఉదాహరణలను పేరొంటున్నారు.
రైతు రుణమాఫీ విషయంలో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం మాట మార్చడాన్ని ఈ సందర్భంగా నిపుణులు ప్రస్తావిస్తున్నారు. రూ.రెండు లక్షల రుణం తీసుకోవాలంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులను కాంగ్రెస్ పార్టీ ఎగ దోసిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన స్టేట్ లెవల్ బ్యాంకర్ల సమావేశంలో సంపూర్ణ రుణమాఫీకి రూ.49,500 కోట్లు అవసరమని లెక కట్టారు. ఒక ఏడాది అవినీతి చేయకుంటే రూ.41 వేల కోట్ల రుణమాఫీ ఒక దెబ్బకి చేయొచ్చని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరొన్నారు. తర్వాత 2024-25 బడ్జెట్ ప్రసంగంలో రుణమాఫీ మొత్తాన్ని రూ.31 వేల కోట్లకు తగ్గించారు. తాజా బడ్జెట్ ప్రసంగంలో రూ.21 వేల కోట్లు రుణమాఫీకి ఖర్చు చేశామని చెప్పారు. రూ.2 లక్షల లోపు రుణం ఉన్న రైతులందరికీ రుణమాఫీ పూర్తయిందని ప్రకటించారు. ఎక్కడి రూ.49,500 కోట్లు! ఎక్కడి రూ.21 వేల కోట్లు! ఎంత తేడా? మొదట చెప్పిన లెక్కలో 42 శాతమే అమలైంది. అయినా అధికార పక్షంలో పశ్చాత్తాపం కానీ, సభ ముందు తప్పు చెప్పానన్న జంకు గొంకు కాని కించిత్తు లేదు.
ఈ అబద్ధాల పర్వం ఇక్కడితో ఆగలేదు. రూ.2 లక్షలకు పైన రుణం ఉన్న రైతులు, రూ.రెండు లక్షలకు పై మొత్తాన్ని చెల్లిస్తే, మిగతా రూ.2 లక్షలు ప్రభుత్వం మాఫీ చేస్తుందని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ, తాజాగా అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రూ.2 లక్షల లోపు రుణం ఉన్న రైతులకు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పినట్టు కుండబద్దలు కొట్టారు. రూ.2 లక్షలకు పైన రుణం ఉన్న రైతులతో తమకు సంబంధం లేదన్నట్టుగా మా ట్లాడారు. ఇలా ఒక రుణమాఫీ విషయంలోనే ప్రభు త్వం పూటకో మాట అన్నట్టుగా ఏడాదిన్నరలో అనేకసార్లు అంకెలు మార్చడం, అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్పడం ఏమిటని నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
అసెంబ్లీలో గతంలో ఒక మాట, ఇప్పు డు ఒక మాట చెప్తే.. చట్టసభలకు ఏం మర్యాద ఇచ్చినట్టు అని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రుణమాఫీ అం దని లక్షలాది రైతులు తమకు చట్టసభల్లోనైనా న్యా యం దొరుకుతుందని ఆశగా ఎదురు చూశారని, వారి ఆశలు అడియాసలు అయ్యాయని ఆవేదన వ్య క్తంచేస్తున్నారు. ఇదే సభలో గతంలో చెప్పిన మాటకు, ఇప్పుడు చేసిన ప్రకటనకు మధ్య వ్యత్యాసం ఉండటంతో చట్టసభల గౌరవాన్ని అధికారపక్షం మంటగలిపిందని విశ్లేషకులు అంటున్నారు.
అప్పుల విషయంలోనూ ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉన్నదని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత, గత ప్రభుత్వాలు చేసిన అప్పులపై అసెంబ్లీ వేదికగా తప్పుడు లెకలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విశ్లేషకులు మండిపడుతున్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా, చట్టసభల్లో మాత్రం వాస్తవ గణాంకాలు వెల్లడిస్తారని ప్రజలు ఆశిస్తారు. కానీ, అధికార పక్షం నోటికొచ్చిన అంకెలు చెప్తూ చట్టసభలను అవమానిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమ ప్రభుత్వం 15 నెలల్లో రూ.1.58 లక్షల కోట్ల అప్పు చేసిందని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ఇందులో రూ.1.53 లక్షల కోట్లను పాత అప్పులు తీర్చడానికి వాడినట్టు చెప్పారు. కానీ, అందులో మూడో వంతు కూడా కట్టలేదన్నది నిపుణుల మాట.
సీఎం చెప్పిన లెకల ప్రకారం నెలకు దాదాపు రూ.పదివేల కోట్లను అప్పులు, వడ్డీలకు చెల్లించినట్టు. ఈ లెకన ఈ ఏడాది బడ్జెట్లో రుణాల చెల్లింపులకు రూ.1.2 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం బడ్జెట్లో రూ.60 వేల కోట్లు మాత్రమే అసలు, కిస్తీల చెల్లింపులకు కేటాయించింది. అంటే చేస్తున్న ప్రచారంలో సగం మాత్రమే కేటాయింపులు ఉన్నాయని అర్థం. నెలకు కేవలం రూ.5,000 కోట్లు చెల్లిస్తూ.. అంతకు రెట్టింపు చెల్లిస్తున్నామని అసెంబ్లీ వేదికగా ప్రకటించడం దేనికి సంకేతం అని ప్రశ్నిస్తున్నారు. ఇలా చెప్తూ పోతే ప్రజలు అసెంబ్లీలో చెప్పే గణాంకాలను నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని సూచిస్తున్నారు. చట్టసభల్లో చెప్పే లెకలకే గౌరవం లేకపోతే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా, ఎంత విడమరిచి చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని వాపోతున్నారు.
రాష్ట్ర ఖజానా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నదని, ప్రభుత్వం రోజువారి ఖర్చులకే అప్పు చేయాల్సి వస్తున్నదని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, ఇతర మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు పదే పదే చెప్తున్నారు. ఒకముకలో చెప్పాలంటే, రాష్ట్ర ఖజానా దివాలా తీసింది అంటూ చట్టసభల సాక్షిగా ప్రపంచానికి వివరిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువగా వస్తున్నాయని అదే అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు. దాదాపు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని ప్రచారం చేసుకుంటున్నారు. అంటే రాష్ట్రానికి జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి పరపతి ఉన్నదని అర్థం.
మరి ప్రజలు దేనిని నమ్మాలి? అన్ని విశ్లేషకుల ప్రశ్న. ప్రభుత్వమే చేస్తున్న ‘దివాలా’ ప్రచారాన్ని నమ్మాలా? లేదా రాష్ట్రం అద్భుతంగా ఉన్నది కాబట్టి పెట్టుబడులు వస్తున్నాయన్న మాటలను నమ్మాలా? అని అడుగుతున్నారు. ‘రాష్ట్ర పరిస్థితిని గురించి ఒకే వేదిక మీద రెండు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడం.. సభ గౌరవాన్ని పెంచుతుందా? రాజకీయ విమర్శలను అర్ధం చేసుకోవచ్చు కానీ, రాష్ట్రం,, దాని పరువు, ప్రతిష్ఠ, పరపతి గురించి మాట్లాడేటప్పుడైనా, అందులో ప్రతి మాటా రికార్డయ్యే అసెంబ్లీలో మాట్లాడేటప్పుడైనా కొంచెం నిజాయతీ ఉండాలి కదా! ప్రతిపక్షాలకు రాజ్యాంగ సంస్థ అయిన అసెంబ్లీలోనైనా కనీస గౌరవం ఇవ్వాలి కదా’ అని నిపుణులు వాదిస్తున్నారు. ‘ రాష్ట్రం దివాలా తీస్తే పెట్టుబడులు రావు. పెట్టుబడులు వచ్చాయంటే రాష్ట్రం దివాలా తీసునట్టు కాదు.’ మరి రెండు భిన్న వాదనలు ఒకే సభలో ఎలా చేస్తరు? దాన్ని ఎలా అనుమతిస్తరు?’ అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
‘రైతు భరోసా’ పేరిట ఏటా ఎకరానికి రూ.15 వేలు చెల్లించాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని గత ఏడాది అసెంబ్లీకి సమర్పించిన బడ్జెట్లోనే ప్రభుత్వం చెప్పింది. కానీ, ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో దానిని రూ.12 వేలకు కుదించింది. అంటే గత సంవత్సరం అసెంబ్లీలో ప్రభుత్వమే స్వయంగా చేసిన ప్రకటనకు విలువ లేకుండా పోయిందని విశ్లేషకులు పేరొంటున్నారు. మరోవైపు, ఇప్పటికే మూడు ఎకరాల వరకు రైతులకు రైతు భరోసా వేశామని, ఈ నెలాఖరు వరకు మిగతా అర్హులైన రైతులందరికీ అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ, మూడెకరాలలోపు ఉన్న తమకు ఇప్పటికీ డబ్బులు జమ కాలేదని స్వయంగా చాలామంది రైతులు చెప్తున్నారు. అంతేకాదు, గత ఏడాది బడ్జెట్లో కౌలు రైతులకు కూడా రైతుభరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు సిద్ధం చేశామని ప్రభుత్వం చెప్పింది. కానీ, ఈసారి బడ్జెట్లో కౌలు రైతుల ఊసే లేదు. పంటల బీమా పథకానిదీ ఇదే కథ.
సాధారణంగా ప్రభుత్వం రాబోయే సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఏయే పథకాలు అమలు చేయాలో నిర్ణయించి, వేటికి ఎంత ఖర్చు చేయాలో లెకలు చేసుకొని బడ్జెట్‌ను రూపొందిస్తుంది. వాటిని శాసనసభలో ప్రకటిస్తుంది. ఇలా ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ప్రతి పథకాన్ని అమలు చేస్తుందని ప్రజలు గట్టిగా నమ్ముతుంటారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గత 15 నెలల్లోనే అనేకసార్లు బడ్జెట్లో ప్రకటించి అమలు చేయకుండా మాట తప్పిందని, సభ అంటే అధికార పక్షానికి లెక్కలేకుండా పోయిందని విశ్లేషకులు పేరొంటున్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు చూపిస్తున్నారు.
ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్ల చొప్పున, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని గత బడ్జెట్లో ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. దానిని అమలు చేయకపోగా.. ఈసారి బడ్జెట్లో కూడా తిరిగి అవే గణాంకాలను వల్లే వేశారని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు చెల్లిస్తామని గత బడ్జెట్లో ప్రతిపాదించారని, ఈ బడ్జెట్లో రూ.5 లక్షలకే పరిమితం చేశారని విమర్శలు ఉన్నాయి. మహిళలకు ఏడాదికి కనీసం రూ.20 వేల కోట్లు తగ్గకుండా, వచ్చే ఐదేండ్లలో లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు అందిస్తామని గత ఎడాది బడ్జెట్లో చెప్పారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు అమలు చేయలేదని పేరొంటున్నారు.
ఇక వడ్డీ లేని రుణాల సంగతి సరే సరి. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు అన్నింటికీ వడ్డీ లేని రుణం పథకం అమలవుతుందని స్వయంగా మంత్రి సీతక అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఇదే సమయంలో.. వడ్డీ లేని రుణం కేవలం రూ.5 లక్షల వరకే పరిమితమన్నది అసలు వాస్తవం. మిగతా రూ.15 లక్షలపై 12% వడ్డీ కట్టాల్సిందే. దళితబంధు పథకం అమలు చేసేందుకు గత ఏడాది బడ్జెట్లో రూ.2,000 కోట్లు కేటాయించారని కానీ ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదని గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా ఇంతే సంగతి. రెండో విడత గొర్రెల పంపిణీ వంద రోజుల్లో చేస్తామని మాట ఇచ్చి, తప్పారని అంటున్నారు. ‘ఒక అంశంపై ఇద్దరు మంత్రులు సభలోనే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ప్రామాణికమైన బడ్జెట్లో పెట్టిన వాటి అమలును విస్మరిస్తున్నారు. అసెంబ్లీలో రికార్డు సాక్షిగా చేసే ప్రకటనలను మారుస్తున్నారు. అసెంబ్లీలో ప్రకటించి, బడ్జెట్ కేటాయించి, అమలు చేయకపోతే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టు?’ చట్ట సభలను ఏం గౌరవిస్తున్నట్టు?’ అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
‘రాష్ట్ర పరిస్థితిని గురించి ఒకే వేదిక మీద రెండు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడం.. సభ గౌరవాన్ని పెంచుతుందా? రాజకీయ విమర్శలను అర్ధం చేసుకోవచ్చు కానీ, రాష్ట్రం,, దాని పరువు, ప్రతిష్ఠ, పరపతి గురించి మాట్లాడేటప్పుడైనా, అందులో ప్రతి మాటా రికార్డయ్యే అసెంబ్లీలో మాట్లాడేటప్పుడైనా కొంచెం నిజాయతీ ఉండాలి కదా! ప్రతిపక్షాలకు రాజ్యాంగ సంస్థ అయిన అసెంబ్లీలోనైనా కనీస గౌరవం ఇవ్వాలి కదా’ అని నిపుణులు వాదిస్తున్నారు.
‘ఒక అంశంపై ఇద్దరు మంత్రులు సభలోనే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ప్రామాణికమైన బడ్జెట్లో పెట్టిన వాటి అమలును విస్మరిస్తున్నారు. అసెంబ్లీలో రికార్డు సాక్షిగా చేసే ప్రకటనలను మారుస్తున్నారు. అసెంబ్లీలో ప్రకటించి, బడ్జెట్ కేటాయించి, అమలు చేయకపోతే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టు?’ చట్ట సభలను ఏం గౌరవిస్తున్నట్టు?’
చట్టసభల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేయడం ఒక ఎతె్తైతే.. అసెంబ్లీ ద్వారా అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా చేయడం బాధాకరమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 57 వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ పదేపదే ప్రచారం చేసుకుంటున్నది. వాస్తవానికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను గత ప్రభుత్వమే ప్రారంభించింది. జోనల్ విధానాన్ని పునర్వ్యవస్థీకరించింది. స్థానిక కోటాను ఖరారు చేసి, విభాగాల వారీగా ఖాళీలను గుర్తించి, భర్తీకి అన్ని రకాల అనుమతులు ఇచ్చి, నోటిఫికేషన్లు విడుదల చేసి, పరీక్షలు నిర్వహించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందజేసింది. కానీ తామే మొత్తం చేసినట్టుగా ప్రభుత్వం స్వయంగా అసెంబ్లీలో ప్రకటించింది. ప్రజలందరి కండ్లముందున్న, అనుభవంలో ఉన్న అంశాలపై కూడా అసెంబ్లీలో అవాస్తవాలు చెప్తున్నారు. ఇది చాలా విచారకరం. ఇదే ధోరణి కొనసాగితే ఇక మున్ముందు అసెంబ్లీలో ప్రభుత్వం చేసే ప్రకటనలకు కూడా విలువ లేకుండా పోయే ప్రమాదం ఉన్నదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హోంగార్డులు మరణిస్తే వారి కుటుంబాలకు 5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నామని ప్రచారం చేస్తున్నారని, కానీ అర్హులైన దాదాపు 18 కుటుంబాలకు ఇప్పటివరకు రూపాయి సాయం కూడా చేయలేదని గుర్తు చేస్తున్నారు.
బీఆర్ఎస్ పాలనలో సీఆర్ఎఫ్ నిధులు రాలేదని, నల్గొండ నియోజకవర్గ రోడ్లకు నిధులు కేటాయించలేదని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కు ఎస్రో అకౌంట్ తెరవలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏకంగా అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. దీంతో.. మంత్రి అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ టిఆర్ఎస్ గణాంకాల తో సహా వివరించడమే కాకుండా ఏకంగా మంత్రిపై సభా హకుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇక రాష్ట్రానికి పడిపోతున్న ఆదాయం పైన ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నది. ప్రపంచం మొత్తం ఆర్థిక మందగమనం నడుస్తున్నదని, దేశంలోనూ స్తబ్దత కనిపిస్తున్నదని, అందుకే రాష్ట్రంలో ఆదాయం పడిపోతున్నదని అసెంబ్లీ వేదికగా ప్రకటించింది.
రాష్ట్రంలో పడిపోయిన రియల్ ఎస్టేట్ పరిస్థితిని, వృద్ధి మందగించిన జీఎస్టీ వసూళ్లను కప్పిపుచ్చడానికి నానా తంటాలు పడింది. కానీ, తాజా నివేదికల ప్రకారం రియల్ఎస్టేట్ రంగంలో బెంగళూరు దూసుకుపోతున్నది. అమరావతిలో భూముల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇతర మెట్రో నగరాలు కూడా మంచి వృద్ధిని కనబరుస్తున్నాయి. సొంత పన్నుల రాబడిలో అటు రాష్ట్రాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రతినెల కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇలా దేశంలో ఎకడా లేని మాంద్యం ఛాయలు తెలంగాణలోనే ఉన్నట్టు ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఎలా చెప్పగలుగుతుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా అసెంబ్లీ వేదికగా వాడకుంటే, చట్టసభలపై ప్రజల్లో ఉన్న నమ్మకం పోదాణ అని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక రేషన్‌కార్డు ఇవ్వలేదంటూ శాసనసభలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పదేపదే పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో 6,47,479 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, ఇందులో 20,69,033 మంది కొత్త సభ్యులను చేర్చినట్లు బీఆర్ఎస్ పక్షం స్పష్టం చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వలేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరామారావు ఆరోపించారు. కానీ తాము రూ.4వేల కోట్ల నిధులతో ప్రాజెక్టులు చేపట్టినట్టు బీఆర్ఎస్ సభ్యులు వివరించారు.
ఎంతో ప్రతిష్ట ఉన్న శాసనసభలో రికార్డెడ్ అంశాలపైనా అబద్ధాలు చెప్పడం ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోనూ అధికార పక్షం ప్రతిపక్షాన్ని బోనులో నిలబెట్టడానికి అసత్య ఆరోపణలు చేసింది. అయితే, బీఆర్ఎస్ నేతలు లేఖలు, జీవోలతో సహా తీసి ఎండగట్టారు. అయినా, ప్రభుత్వం నుంచి కనీస దిద్దుబాటుగానీ, పశ్చాత్తాపం గానీ, సభను క్షమాపణ కోరడంగానీ జరగలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అసెంబ్లీ వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారాలకు అంతులేకుండా ఉండటం లేదని నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇది చట్టసభల గౌరవాన్ని, మర్యాదను కాపాడుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.
కాళేశ్వరం విషయంలోనూ ఇలాగే జరిగింది. కాళేశ్వరం కుప్పకూలిందంటూ సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ వరుసపెట్టి ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో.. ప్రాజెక్టులో ఒక బరాజ్‌లో మాత్రమే సమస్య ఉన్నదని, కాళేశ్వరంలో భాగమైన అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు పటిష్టంగా ఉన్నాయని ప్రభుత్వమే ఒప్పుకున్నది. మరి కూలిపోయింది అన్న మాటలు నమ్మాలా? ఇది అసెంబ్లీకి ఏం శోభనిస్తుంది? అని సీనియర్ పాత్రికేయులు ప్రశ్నిస్తున్నారు.
అసెంబ్లీలో గతంలో ఒక మాట, ఇప్పుడు ఒక మాట చెప్తే.. చట్టసభలకు ఏం మర్యాద ఇచ్చినట్టు? రుణమాఫీ అందని లక్షలాది రైతులు తమకు చట్టసభల్లోనైనా న్యాయం దొరుకుతుందని ఆశగా ఎదురు చూశారు, వారి ఆశలు అడియాసలు అయ్యాయి. ఇదే సభలో గతంలో చెప్పిన మాటకు, ఇప్పుడు చేసిన ప్రకటనకు మధ్య వ్యత్యాసం ఉండటంతో చట్టసభల గౌరవాన్ని అధికారపక్షం మంటగలిపింది.
శాసనసభ, మండలిలో చర్చలు, ప్రసంగాలు హుం దాగా సాగాలి. కోట్లాది ప్రజల తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులు చర్చల్లో పాల్గొంటారు. వారు మాట్లాడే ప్రతి పదం.. వారిని నమ్మి చట్టసభలకు పంపిన లక్షలాదిమంది ప్రజల గొంతుకగా అభివర్ణిస్తుంటారు. బయట రాజకీయ వేదికల్లో ఎంత ఘాటు విమర్శలు చేసుకున్నా.. అసెంబ్లీలో మాత్రం సభ్యుల గౌరవ మర్యాదలు కాపాడేలా మంచి ప్రవర్తన ఉన్నప్పుడే చట్టసభలపై ప్రజల్లో గౌరవం కొనసాగుతుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపిస్తుంది. కానీ ఇటీవల అసెంబ్లీలో తిట్ల దండకం వినిపిస్తుండడం ఆందోళన కలిగిస్తున్నదని నిపుణులు పేరొంటున్నారు. ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టుల గురించి సీఎం రేవంత్‌రెడ్డి ఏకంగా అసెంబీలోనే మాట్లాడుతూ.. బట్టలు ఊడదీసి కొడతాం, పరిగెత్తిస్తాం అంటూ వ్యాఖ్యానించడం దారుణమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ముఖ్యంగా మహిళా జర్నలిస్టుల గురించి చర్చ జరుగుతున్న సమయం లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వారి పరువుకు భంగం కలిగించడమేనని అంటున్నారు. ప్రస్తుత శాసనసభలో 60 మందికి పైగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర సీనియర్ శాసనసభ్యులను చూసి వారు నేర్చుకుంటారు. కానీ స్వయంగా ముఖ్యమంత్రి సభలో ఇలాం టి వ్యాఖ్యలు చేయడం ద్వారా వాళ్లకి ఎలాంటి సందేశం ఇస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హుందాగా చర్చలు జరగాల్సిన చోట బూతుల దండకం ఎత్తుకుంటే.. ఇలాంటి ప్రసంగాలను ప్రజలు స్వీకరిస్తారా? దీనిద్వారా శాసన విలువల్ని మనం కాపాడగలుగుతామా? చట్టసభలను అత్యున్నత ప్రమాణాలతో నడిపించగలుగుతామా? అనే ప్రశ్నలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి.
‘మొత్తం మీద అసెంబ్లీలో అధికార పక్షం తీరుతెన్నులు చూ స్తుంటే వారికి సభంటే భయం, భక్తి రెండూ ఉన్నట్టు కనిపించడం లేదు. నిండు సభలో నిలబడి ప్రవాహంలా అబద్ధాలు చెప్తున్నప్పుడు ఇంతకు మించి ఏమనగలం? ’ అని సీనియర్ రాజకీయ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. చాలామంది మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ఏమా త్రం సిద్ధం కాకుండా అసెంబ్లీకి వస్తున్నారని విమర్శలున్నాయి. ఏ అంశంపై చర్చిస్తున్నామో చివరి నిమిషం వరకు అధికార పార్టీ సభ్యులకు కూడా తెలియడం లేదన్నది ప్రధాన ఆరోపణ. ‘మీరు అసెంబ్లీని నడిపిస్తున్నారా? లేదా గాంధీభవన్‌ను నడిపిస్తున్నారా?’ అంటూ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలుగుతున్న ఎంఐఎం పార్టీ తీవ్ర విమర్శలు చేసిందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు అని సీనియర్ పాత్రికేయులు పేర్కొంటున్నారు.
గత ఏడాది బడ్జెట్ సందర్భంగా పంటల బీమా అమలుకు రూ.1,300 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. కానీ అమలు చేయలేదు. అంటే శాసనసభలో ప్రభుత్వం ఇచ్చిన హామీకే విలువ లేకుండా పోయిందన్నమాట. ‘ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు చేసి మాట తప్పారంటే అధికారం కోసం అడ్డదారులు తొక్కారులే అని అర్ధం చేసుకోవచ్చు. కానీ, రాష్ట్ర వర్తమానానికీ, భవిష్యత్తుకు ప్రామాణికమైన బడ్జెట్ డాక్యుమెంట్లో ఏడాదికోమాట చెప్పడమేంటి? సీజన్ మారినట్టు మాటలు మారుతాయా? ఇది అత్యున్నతమైన అసెంబ్లీని వంచించడం కాదా? ఇైట్లెతే ఇక బడ్జెట్ పత్రాలకు, అందులోని గణాంకాలకు సాధికారత ఏముంటుంది?’ అని ఆర్థిక నిపుణులు విస్తుపోతున్నారు. ఇలాగే కొనసాగితే ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పే మాటలను ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నిస్తున్నారు.
రూ.వందల కోట్ల విషయాల్లోనే కాదు, చిన్న చిన్న అంశాల్లో కూడా అధికారపక్షం సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నదనే భావన వ్యక్తమవుతున్నది. ఉదాహరణకు విద్యార్థుల యూనిఫారం కుట్టుగూళ్లకు రూ.75 చొప్పున ఇస్తున్నామని ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చెప్పింది. వాస్తవానికి ప్రభుత్వం రూ.75 చొప్పున కేటాయిస్తూ జీవో జారీ చేసింది తప్ప నిధులు విడుదల చేయలేదు. ఇప్పటివరకు రూ.50 చొప్పున విడుదల చేశారు. అవి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. అయినా ఇంత చిన్న విషయానికి కూడా అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్పడం ఏమిటనే విస్మయం వ్యక్తమవుతున్నది. విదేశీ విద్యా నిధి పథకం కింద మూడు సీజన్లకు 450 మంది విద్యార్థులకు సాలర్షిప్ ఇవ్వాల్సి ఉంటుందని, అందరికీ ఇచ్చేశామని ప్రభుత్వం చెప్పింది. అయితే 180 మందికి మాత్రమే స్కాలర్షిప్ అందిందని గణంకాలు చెప్తున్నాయి.
‘ఇలా రూ.25, రూ.20 లక్షల దగ్గరే ప్రభుత్వం ఇంత అసత్య ప్రచారం చేస్తే.. ఇక పవిత్రమైన అసెంబ్లీని ఏం గౌరవించినట్టు? అక్కడ ప్రభుత్వం ఇచ్చే గణాంకాలకు విలువ ఎక్కడుంటుంది?’ అని సభా వ్యవహారాలను పరిశీలిస్తున్న సీనియర్ జర్నలిస్టు ప్రశ్నిస్తున్నారు. ఇదొకటే కాదని, ఇలాంటివి ఇంకా అనేకం ఉన్నాయని అంటున్నారు. గత ఏడాది వరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నీ ఇచ్చేశామని ఒక మంత్రి శాసనమండలిలో ప్రకటించారు. మళ్లీ ప్రభుత్వమే పాత బకాయిలు ఇవ్వలేదని, 15 నెలలకు సంబంధించిన బకాయిలు మాత్రమే ఇచ్చామని చెప్పింది. అంటే శాసనమండలిలో మంత్రి చెప్పిన మాటలకే విలువ లేదా? అని వారు ప్రశ్నిస్తున్నారు.