Congress | డబ్బులు ఉంటే చాలు రాజకీయం చేయొచ్చని నమ్మి వనపర్తి జిల్లాలో ఓ చోటా లీడర్ బొక్కబోర్లా పడ్డాడు. కాంగ్రెస్ రాజకీయం తెలియక చేసిన శపథాలు, ‘వనపర్తి టికెట్ నాదే’నంటూ బీరాలు పలికిన ఆ లీడర్ హస్తం రాజకీయాలకు బలైపోయారు. ఓ సీనియర్ నేత ‘నువ్వు బచ్చాగాడివి.. నా ముందు కుప్పి గంతులా?’ అంటూ టికెట్ ఎగరేసుకుపోవ డంతో ఆ లీడర్ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. టికెట్ నాకే ఇవ్వండి.. మహాప్రభో అంటున్నా అధిష్ఠానం లెక్కచేస్తలేదంట. మొన్నటి వరకు ఓ మండలానికి ఎంపీపీగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా కారు దిగిపోయారు.
ఏకంగా మంత్రినే ఓడిస్తానని శపథాలు చేశారు. హైదరాబాద్ నుంచి పెయిడ్ మీడియాలో, సమావేశాల్లో పిచ్చి ప్రేలాపనలు చేశారు. తొలుత కమలం పార్టీలో కలిసిపోదామని ఈటలను వనపర్తికి పిలిపించి ఆయన ముందే కొట్లాడుకోవ డంతో ‘టికెట్ ఎవరికి కావాలో నిర్ణయించు కొని హైదరాబాద్ రావాలి’ అని చెప్పి ఆయన జారుకున్నారు. దీంతో జూపల్లిని పట్టుకొని కాంగ్రెస్లో చేరారు.
కొల్లాపూర్ టికెట్ జూపల్లికి.. వనపర్తి టికెట్ తనకే ఇవ్వాలని ఢిల్లీలో బేరసారాలు చేశారు. ‘సరే చూద్దాం లే’ అని ఢిల్లీ పెద్దలు చెప్పడంతో ‘టికెట్ నాదే’ అంటూ సోషల్మీడియాలో ప్రచారంతో హోరెత్తించారు. నిన్నగాక మొన్న పార్టీలోకొచ్చి టికెట్ కావాలంటావా? అంటూ రాజకీయాల్లో తలపండిన చిన్నారెడ్డి టికెట్ చేజిక్కించు‘కొన్నారు’.
ఢిల్లీలో ఉండి లాబీయింగ్ చేసినా ఫలితం దక్కక తన సత్తా చూపిస్తానంటూ మీటింగ్ పెట్టి అభాసుపాలయ్యారు. సభకు వచ్చిన జనాలకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఉన్న పరువు కాస్త పోయింది. జనాగ్రహం వీడియోలు సోషల్ మీడియాలో వైరలై, కాంగ్రెస్ పెద్దలకు చేరడంతో ‘టికెట్ సంగతి దేవుడెరుగు తిట్ల పురాణం వినాల్సి వస్తున్నద’ని సదరు నేత వాపోతున్నారట!
– వెంకటేశ్వర్రావ్