సివిల్ కేసుల్లో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్లను నిర్లక్ష్యం చేస్తున్న పోలీస్ అధికారులపై కోర్టులో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వారం రోజులుగా దీక్ష చేస్తున్న న్యాయవాదులు, బుధవారం సైతం విధులు బహిష్కరించి అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు.
నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రద్దు చేసి ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరుతూ బుధవారం వారు నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై ఆటోలు నిలిపి నిరసన చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్(ప్రజాపంథా) ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ జిల్లా ధర్పల్లి తాహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అర్హులైన వారికి తెల్లరేషన్ కార్డులు, ఇంటి స్థలంతోపాటు ఇల్లు నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.