రంగారెడ్డి, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ)/కందుకూరు : ‘ఫ్యూచర్‌సిటీ కోసం అవసరమైన భూములను ఎలాగైనా తీసుకుంటాం.. భూసేకరణ కోసం నోటిఫై చేసిన భూములు ఈ రోజు కాకపోయినా, రేపయినా ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. ఇక ఆ రైతులు నష్టపరిహారం తీసుకొని మరోచోట భూములు కొనుగోలు చేసుకోవాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని ముచ్చర్ల వద్ద ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ తరహాలో ఫ్యూచర్‌సిటీ నిర్మిస్తున్నామని చెప్పారు. పెట్టుబడిదారులకు నమ్మ కం కలిగించేందుకే మొదట 23 ఎకరాల్లో ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఫ్యూచర్‌సిటీ నిర్మాణంలో భాగంగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే పలు సంస్థలకు అవసరమైన భూముల కోసం భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేశామని పేర్కొన్నారు. నోటిఫికేషన్లు ఇచ్చినా రైతులు పరిహారం తీసుకోక ఇప్పటికే నష్టపోయారని, ఇప్పటికే పరిహారం తీసుకొని ఉంటే పక్కనే తక్కువ ధరలకు భూములు దొరికేవని చెప్పుకొచ్చారు. ఫ్యూచర్‌సిటీ ఏర్పాటైన తర్వాత ఈ ప్రాంతంలో కూడా భూముల ధరలు విపరీతంగా పెరిగి ఎకరాల నుంచి గజాల్లోకి వచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా రైతులు తమకు వచ్చే నష్టపరిహారాన్ని తీసుకొని మరోచోట భూములు కొనుగోలు చేసుకోవాలని కోరారు. అధికారులు కూడా రైతులను భయపెట్టవద్దని, వారికి నచ్చచెప్పి నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు.
గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామసభలు నిర్వహించి రైతులను ఒప్పించాలని చెప్పారు. ఫ్యూచర్‌సిటీ పరిధిలోకి తమ గ్రామాలను తీసుకోవాలని కొంతమంది తన దృష్టికి తీసుకొచ్చారని, ఆయాచోట్ల అధికారులు గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని, అవసరమైతే చట్టాన్ని సవరించి అలాంటి గ్రామాలను కూడా తీసుకుంటామని తెలిపారు. ఇకనుంచి ఫ్యూచర్‌సిటీ పరిధిలో జరిగే అన్ని కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులను పిలువాలని, పాస్‌లు పంపాలని ఆదేశించారు. అనంతరం కొత్తగూడెం, భద్రాచలం జిల్లాకు చెందిన గిరిపుత్రులకు నియామక పత్రాలు అందజేశారు. మహోయిస్టులకు దారిచూపిన వారు ఇక మీదట టూరిస్టులకు దారి చూపుతారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ నాయకులను రాక్షసులు, మారీచులు అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి తన అక్కసును వెళ్లగక్కా రు. వారి పాపాలు తనకు శంకరాభరణం సినిమాలో సంగీతంలా వినిపిస్తున్నాయంటూ పలు రకాలుగా పోల్చుస్తూ విపరీత వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు మూడు బుల్లెట్ ట్రైన్లు అందుబాటులోకి రానున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బుల్లెట్‌ట్రైన్ సెంటర్‌ను శంషాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, త్వరలో భూసేకరణ నోటిఫికేషన్ వెలువడనున్నదని పేర్కొన్నారు. శంషాబాద్ కేంద్రంగానే అమరావతి, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు బుల్లెట్ ట్రైన్లు అనుసంధానం కానున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, రాజసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, అరికెపూడి గాంధీ, డీజీపీ శివధర్‌రెడ్డి, ఫ్యూచర్‌సిటి కమిషనర్ సుధీర్‌బాబు, కలెక్టర్ నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.