Telangana Budget | హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఎన్నికలకు ముందు ఎక్కడ పడితే అక్కడ డిక్లరేషన్లను ప్రకటిస్తూ అన్ని వర్గాల ఓట్లను దండుకొన్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆ డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసినట్టు కనిపిస్తున్నది. శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో డిక్లరేషన్ల ఊసే లేకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. కేవలం ఒక చోట మాత్రమే అన్ని డిక్లరేషన్లను కచ్చితంగా అమలు చేస్తామని మాత్రమే పేర్కొన్నది. కానీ అ అమలు కోసం ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం. ఎన్నికల సమయంలో ఆయా వర్గాల ప్రజలను ఆకట్టుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం వరంగల్ డిక్లరేషన్, యువకుల కోసం హైదరాబాద్‌లో యువ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీల కోసం చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, బీసీల కోసం కామారెడ్డిలో బీసీ, మైనార్టీ డిక్లరేషన్‌ను ప్రకటించింది.
ఆ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఈ డిక్లరేషన్లను ఆర్బాటంగా ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే వీటిలోని ప్రతి అంశాన్ని అమలు చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ డిక్లరేషన్లను పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ హామీలు అమలు చేయాలంటే నిధులు అవసరం. నిధులు కావాలంటే బడ్జెట్లో కేటాయించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్లో డిక్లరేషన్ల అమలుకు అవసరమైన నిధులను కేటాయించలేదు. అయినప్పటికీ డిక్లరేషన్లను అమలు చేస్తామంటూ చెప్పడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఐదు డిక్లరేషన్లలో రైతులకు సంబంధించి వరంగల్ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ అత్యంత కీలకమైనవి. ఈ రెండింటిలో ఆ పార్టీ 14 హామీలు ఇచ్చింది. రైతుల డిక్లరేషన్‌కు సంబంధించి రైతుభరోసా కింద రూ. 15వేలు, ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ, కూలీలకు రూ. 12 వేలు, అన్ని పంటలకు మద్దతు ధర, పంటల బీమా, ప్రతి ఎకరాకు సాగునీళ్లు, రైతు కమిషన్ ఏర్పాటు, కొత్త వ్యవసాయ విధానం, ధాన్యంతోపాటు ప్రతి పంటకు మద్దతు ధరకు అదనంగా రూ. 500 బోనస్ చెల్లింపు వంటి అంశాలున్నాయి.
యూత్ డిక్లరేషన్‌కు సంబంధించి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రతి ఏడాది జూన్ 2న జాబ్ క్యాలండర్, సెప్టెంబర్ 17లోపు ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి చెల్లింపు, యూత్ కమిషన్ ఏర్పాటు, యువకులకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం.. ఇలా చాలా హామీలనే ఇచ్చింది. కానీ ఈ హామీలను నెరవేర్చేందుకు బడ్జెట్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం గమనార్హం. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.