హైదరాబాద్, జూన్20 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును మరో 2నెలలు పొడిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు ప్రభుత్వం విధించిన 100 రోజుల నిర్ణీత గడువు ముగియనున్నది.
ఈ నేపథ్యంలో మరో 2 నెలలు కమిషన్ గడువును పొడిగిస్తూ నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే కమిషన్ ఎదుట వెల్లడించిన అంశాలన్నింటినీ 26వ తేదీలోపు అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని నిర్మాణ సంస్థలు, అధికారులకు జస్టిస్ సూచించారు. ఆ తదనంతరం ఆయా అఫిడవిట్లను పరిశీలించి విచారణను ప్రారంభించేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తున్నది.