హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గృహనిర్మాణశాఖలో కీలకమైన హౌసింగ్ బోర్డు భవితవ్యం అగమ్యగోచరమైంది. నియామకాలు లేక సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 296 మంజూరు పోస్టులకు, 34 మంది మాత్రమే పనిచేస్తుండటంతో పనిభారం తీవ్రమైందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇటీవల మెహిదీపట్నంలో ఓ ఫంక్షన్ హాల్‌ను సీజ్ చేసేందుకు వెళ్లిన అధికారి అనారోగ్యంతో మృత్యువాత పడటంతో ఉద్యోగుల కొరత విషయం హౌసింగ్ బోర్డ్‌లో మరోసారి చర్చనీయాంశమైంది. 140 మంది ఇంజినీర్ పోస్టులకుగాను నలుగురు మాత్రమే ఉన్నారని, ఇందు లో ఇద్దరు డిసెంబర్లో ఉద్యోగ విరమణ చేస్తారని ఉద్యోగులు చెప్తున్నారు.
పోస్టులను భర్తీ చేయాలంటూ బోర్డు వైస్ చైర్మన్ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాశారు. కొత్తగా నియమించకపోయినా.. కనీసం డిప్యూటేషన్‌పై అయి నా ఉద్యోగులను పంపించాలని కోరారు.