హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీలో కంప్యూటర్ హ్యాకిం గ్, ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో దర్యాప్తు శరవేగంగా సాగుతున్నది. ఈ కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న 9 మంది నిందితులను కోర్టు అనుమతితో సిట్ శనివారం కస్టడీకి తీసుకొన్నది. కీలక నిందితులైన టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్, నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డిని సిట్.. టీఎస్పీఎస్సీ కార్యాలయానికి తీసుకెళ్లింది. కమిషన్‌లో అసలేం జరిగింది? ఎవరెవరు ఏం చేశారు? తదితర అంశాలను తెలుసుకొనేందుకు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసింది. కంప్యూటర్లను ఎలా హ్యాక్ చేశారు? ప్రశ్నాపత్రాలను ఎలా కాజేశారో? మళ్లీ చేయించారు. పేపర్ కస్టోడియన్ శంకర్లక్ష్మి సిస్టమ్ పాస్‌వర్డ్‌ను ఎలా దొంగిలించారు? ఆ తరువాత ఆమె కంప్యూటర్ నుంచి ప్రశ్నాపత్రాలను ఎలా డౌన్లోడ్ చేశారు? తదితర పూర్తి వివరాలను నిందితులతో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయించారు. టీఎస్పీఎస్సీలోని మరో రెండు కంప్యూటర్లను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.
చంచల్‌గూడ జైలు నుంచి శనివారం ఉదయం నిందితులను హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయానికి తరలించారు. ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌ను అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి వేర్వేరుగా విచారించా రు. గతంలో ఇంకేమైనా ప్రశ్నాపత్రాలు తస్కరించారా? ఇటువంటి వ్యవహారాలు ఇంకెప్పుడైనా చేశారా? అనే కోణంలో వివరాలు సేకరించారు. ఇద్దరూ చెప్పిన సమాధానాలను నమోదు చేసుకొని.. టీఎస్పీఎస్సీకి తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ నిర్వహించారు. మరో కీలక నిందితురాలైన రేణుకను సీసీఎస్ ఉమెన్ పీఎస్‌కు తరలించి విచారించారు. మొత్తం ఆరు రోజులు నిందితులను సిట్ కస్టడీకి తీసుకొనేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.