హైదరాబాద్, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ): మద్యంషాపుల లాటరీ ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తెచ్చిపెట్టిన ఎక్సైజ్ శాఖ అధికారులు.. ఇప్పుడు సొంత జేబులు నింపుకొనే పనిలోపడ్డారు. ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగే ప్రతి పనికీ ఒక రేటు ఫిక్స్ చేశారు. మద్యం దుకాణాలకు లాటరీ ప్రక్రియ… లైసెన్స్ కేటాయింపు.. నెల రోజుల గడువుతో తాతాలిక ప్రొవిజనల్ లైసెన్సులతో షాపులు తెరువడం.. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన నేపథ్యంలో.. ప్రస్తుతం రెండేండ్ల శాశ్వత లైసెన్స్ కేటాయింపులు జరుగుతున్నాయి. ఈ లైసెన్స్ మంజూరు కోసం ఒక్కో దుకాణానికి రూ.2.5 లక్షలు, గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఫోకల్ స్టేషన్లలోని దుకాణానికి రూ.3.5 లక్షల చొప్పున మామూళ్లు ఫిక్స్ చేశారని సమాచారం. ఇందుకోసం ప్రతి స్టేషన్లోనూ వసూళ్లలో ఆరితేరిన ఇద్దరు ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. వసూళ్ల వ్యవహారం ఏ స్టేషన్‌కు ఆ స్టేషన్లోనే జరుగుతున్నా.. దిగువస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకు ఎవరి వాటా వాళ్లకే వెళ్తుందని ఎక్సైజ్ సిబ్బంది చెప్తున్నారు.
డబ్బు కడితేనే శాశ్వత లైసెన్స్
రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలున్నాయి. వీటికి గత నెలలో లాటరీ నిర్వహించి లైసెన్స్‌లు కేటాయించారు. ఈ నెల 1 నుంచి కొత్త లైసెన్స్‌లు అమల్లోకి వచ్చాయి. లైసెన్స్ కేటాయింపులు జరుగగానే పూర్తిస్థాయి సదుపాయాలతో మద్యం దుకాణం ఏర్పాటుచేయడం సాధ్యం కాదు కాబట్టి, ఎక్సైజ్ శాఖ ముందుగా నెల రోజుల గడువుతో ప్రొవిజనల్ లైసెన్స్ కేటాయిస్తుంది. ఈ నెల రోజుల్లో దుకాణదారుడు 1/8వ వంతు బ్యాంకు గ్యారెంటీ, మద్యం దుకాణం బ్లూప్రింట్, పర్మిట్రూం బ్లూప్రింట్, గౌడ, ఎస్సీ, ఎస్టీలైతే కుల ధ్రువీకరణ సర్టిఫికెట్, రూ.100 బాండ్ పేపర్లు ఏడు, దుకాణం వర్కర్ల పేర్లు తదితర ఫార్మాలిస్ ఎక్సైజ్ నిబంధనల ప్రకారం సరిచూసుకుని రెండేండ్ల కాలానికి పర్మినెంట్ లైసెన్స్ మంజూరు చేస్తారు.
ఈ లైసెన్స్‌లను ఎక్సైజ్ శాఖ ఉచితంగానే జారీచేయాలి. కానీ, ఎక్సైజ్ అధికారులు ఈ ప్రక్రియకు ఒక రేటు ఫిక్స్ చేశారు. ఒక్కో దుకాణానికి రాష్ట్రవ్యాప్తంగా రూ.2.5 లక్షలు, రంగారెడ్డి, మల్కాజిగిరి, మెదక్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల అర్బన్ ప్రాంతాల్లో దుకాణానికి రూ.3.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. సగటున రాష్ట్రవ్యాప్తంగా రూ.78 కోట్లుకు పై చిలుకు మామూళ్లు వసూలు చేసినట్టు ఎక్సైజ్ శాఖలో ప్రచారం జరుగుతున్నది. ఇందులో 40% డబ్బు ఆయా ఎక్సైజ్ స్టేషన్‌కు, మిగిలిన 60% డబ్బు పై స్థాయి అధికారులకు ముడుతున్నట్టు సమాచారం. మామూ ళ్లు ఇవ్వకుండా ఎవరైనా ఎదురుతిరిగితే రోజువారీ కేసులు పెట్టి లైసెన్స్‌పై వేటు వేస్తారని, లేదంటే షాపులు సీజ్ చేస్తారన్న భయం వ్యా పారుల్లో నెలకొన్నది. దీంతో మద్యం వ్యాపారులు, సిండికేట్లు ఎవరికివారు ముడుపులు ముట్టజెప్పి లైసెన్స్‌లు తీసుకుంటున్నారు.
నెల మామూళ్లు అదనం
ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.2.5 లక్షల మామూళ్లు కేవలం శాశ్వత లైసెన్స్ కేటాయింపుల కోసమేనని పేరు చెప్పడానికి ఇష్టపడని మద్యం వ్యాపారి ఒకరు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధికి తెలిపారు. ఇవి కాకుండా ప్రతి నెలా ఒకో దుకాణానికి రూ.70 వేల వరకు మామూళ్లు వెళ్తున్నాయని చెప్తున్నారు. స్థానిక పోలీసులకు నెలవారీ మామూళ్లు ఇవ్వకపోతే.. దుకాణం ముందే డ్రంక్ అండ్ డ్రైవ్ టె స్టులు పెడతారని, మద్యం తాగిన వ్యక్తులు గొ డవకు దిగితే.. పోలీసులు వచ్చి దుకాణం ఉ ద్యోగుల మీద లాఠీలు ఝులిపిస్తారని దుకాణదారులు తమ అనుభవాన్ని వివరించా రు. ఎక్సైజ్ శాఖలో ఐదు విభాగాలు ఉన్నాయ ని, వీటిలో మూడు విభాగాలకు నెల మా మూళ్లు, రెండు విభాగాలకు మూడు నెలలకు ఒకసారి సమర్పించుకోవాలని చెప్తున్నారు. ఇవికాకుండా స్టేట్ టాస్క్‌ఫోర్స్ తనిఖీలకు వ చ్చినప్పుడు డీజిల్ ఖర్చులు, దసరా మామూ ళ్లు అదనంగా సమర్పించుకోవాలని చెప్తున్నారు.
క్వార్టర్‌పై రూ.30 ఎమ్మార్పీ ఉల్లంఘన
ఒకవైపు కోటి రూపాయల వరకు ప్రభుత్వ లైసెన్స్ ఫీజు, మరోవైపు కోట్ల రూపాయలు పెట్టి లైసెన్స్ లీజు గుడ్‌విల్, ఇంకోవైపు ఎక్సైజ్ మామూళ్లు.. ఈ నేపథ్యంలో పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవాలంటే.. ఎమ్మార్పీ ఉల్లంఘ న, బెల్టు దుకాణాల ద్వారా మద్యం విక్రయం మినహా మరో మార్గంలేదని వ్యాపారులు చెప్తున్నారు. రాష్ట్రంలో గత పదేండ్లుగా ఎమ్మార్పీని కఠినంగా అమలుచేశారు. కానీ, ఈసారి కనీవిని ఎరుగనంత ఎమ్మార్పీ ఉల్లంఘన జరుగుతున్నదని ఎక్సైజ్ శాఖలో చర్చించుకుంటున్నారు. ఒక్కో క్వార్టర్ బాటిల్‌కు మద్యం దుకాణాల్లో రూ.15, బెల్టు దుకాణాల్లో రూ.30 చొప్పున ఎమ్మార్పీ ఉల్లంఘన జరుగుతున్నదని చెప్తున్నారు. ప్రస్తుతం రూ.160 విలువైన క్వార్టర్ బాటిల్ మద్యం దుకాణాల్లో రూ.175 ,బెల్ట్ కౌంటర్లో రూ.190 చొప్పున విక్రయిస్తున్నారనే ఫిర్యాదులొస్తున్నాయి. దీని మీద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంటుతోపాటు ఏసీబీ అధికారులు దృష్టిపెట్టాలని డిమాండ్ చేస్తునారు.
మద్యం దుకాణదారులు చెప్తున్న సమాచారం ప్రకారం వారు సమర్పించుకుంటున్న మామూళ్లు ఇలా..
శాఖ : నెల వారీ మామూళ్లు
స్థానిక పోలీస్‌స్టేషన్ : రూ.25,000
ఎక్సైజ్ స్టేషన్ : రూ.15,000
డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ : రూ.8,000
ఎన్ఫోర్స్మెంట్ : రూ.30,000 (మూడు నెలలు)
ఈఎస్, డీసీ కలిపి : రూ.5,000
స్టేట్ టాస్‌ఫోర్స్ : రూ. 6000 (మూడు నెలలు)