ధర్మారం, సెప్టెంబర్27: కాంగ్రెస్ నేత, ఉమ్మడి కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు చుక్కెదురైంది. బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం ఎస్సీ కాలనీలోని గణేశ్ మండపానికి వచ్చిన ఆయనను యువకులు అడ్డుకున్నారు. ‘నాడు జడ్పీ చైర్మన్ హోదాలో ఉన్న నువ్వు.. పెద్ద చెరువు కింద భూములు కోల్పోయిన మాకు ఎందుకు పరిహారం ఇప్పించలేదు? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చినవ్?’ అంటూ యువత ప్రశ్నల వర్షం కురిపించడంతో కంగుతిన్నారు. లక్ష్మణ్‌కుమార్ వినాయకుడి మండపం వద్దకు వచ్చారని తెలుసుకున్న కాలనీ మాదిగ యువకులు దూడ సురేశ్, దూడ శ్రీధర్, దూడ రవికుమార్, గసికంటి సురేశ్ తదితరులు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ..
గ్రామంలో డప్పు కొట్టినందుకు 27 కుటుంబాలకు చెందిన మాదిగలకు చెరువు కట్ట కింద ఉన్న 6 ఎకరాల 30 గుంటల భూమిని 40 ఏండ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. 12 ఏండ్ల క్రితం చెరువు నిర్మాణంలో ఈ భూమి మునిగిపోయిందని, అప్పుడు లక్ష్మణ్‌కుమార్ జడ్పీ చైర్మన్‌గా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. బాధితులు ఆయన వద్దకు వెళ్లి పరిహారం ఇప్పించాలని వేడుకున్నా పట్టించుకోని అడ్లూరి.. ఈ రోజు కాలనీకి రావడంతో అడ్డుకున్నట్టు తెలిపారు. తమకు పరిహారం ఇప్పించకపోవడమేగాకుండా ఆ భూమిని గ్రామానికి చెందిన కన్న భూమయ్య కుటుంబానికి అక్రమంగా ఎందుకు పట్టా చేయించావని మండిపడ్డారు. ఇక్కడి నుంచి తక్షణమే వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. దీంతో లక్ష్మణ్‌కుమార్ అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా, అడ్లూరిని నిలదీసిన ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.