హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత, చలి గాలులతో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు చలి ప్రభావానికి గజగజలాడిపోతున్నాయి. ఈ జిల్లాల్లో ఉదయం, రాత్రి సమయాల్లో చలి తీవ్రత విపరీతంగా ఉంటుంది. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలులు వీస్తున్నాయని, దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపింది.
హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత ఊహించని స్థాయిలో ఉన్నదని, పలుచోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయని వెల్లడించింది. హెచ్‌సీయూ, గచ్చిబౌలి, మౌలాలి వంటి ప్రాంతాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 10.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వివరించింది. మరోవైపు రానున్న మూడ్రోజులు తర్వాత దాదాపు అన్నిచోట్ల చలి తీవ్రత తగ్గే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. సంక్రాంతి తర్వాత వాతావరణంలో మరిన్ని మార్పులుంటాయని వెల్లడించింది.