బయ్యారం, జనవరి 8: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ సమీపంలోని బయ్యారం పెద్దచెరువుపై ఆదివారం సాయంత్రం బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. కురవి మండలం ఊరుగుండ్రాతిమడుగు గ్రామానికి చెందిన బోదంగండ్ల రవి పొలంపల్లి తండాలోని రైల్వే ట్రాక్ వద్ద గేట్మెన్గా పనిచేస్తున్నాడు. ఆదివారం చెరువు సమీపంలో కల్లు తాగేందుకు మరో ముగ్గురితో కలిసి వెళ్లాడు.
తిరిగి వస్తుండగా చెట్లపొదల్లో ప్లాస్టిక్ కవర్ గమనించి, అందులో ఏముందో చూసేందుకు ప్రయత్నించగా, ఒక్కసారిగా పెద్దశబ్దంతో పేలింది. ఈ ఘటనలో రవి రెండు చేతులు పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, కండ్లు కూడా దెబ్బతిన్నాయి. అతని వెంట ఉన్న మిగతా ముగ్గురు రవిని మహబుబాబాద్ ఏరియా దవాఖానకు తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు.