HomeTelanganaThe Inauguration Of The 35th National Book Fair
ఉద్యమాలను నడిపించేవి పుస్తకాలే
తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నక్సల్బరీ, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం వరకు పుస్తకాలే ఉద్యమాలను నడిపించాయని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గుర్తుచేశారు.
జీవితాన్ని తీర్చిదిద్దేది పుస్తకమే
జ్ఞానసంపదను జాతికి అందించాలి
35వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నక్సల్బరీ, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం వరకు పుస్తకాలే ఉద్యమాలను నడిపించాయని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గుర్తుచేశారు. జీవితాన్ని తీర్చిదిద్దేది పుస్తకమేనని, ఏ సమాజం లోనైనా మార్పు తీసుకురావాలంటే పుస్తకమే నాంది అని చెప్పారు. జ్ఞాన సంపదను జాతికి అందించాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ఏటా బుక్ ఫెయిర్ నిర్వహణను ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం) మిద్దె రాములు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 35వ జాతీయ పుస్తక ప్రదర్శన (అలిశెట్టి ప్రభాకర్ వేదిక)ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.
సమాజ మార్పునకు పుస్తకం ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా పుస్తక పఠనంతో వచ్చిన జ్ఞానం శాశ్వతమని పేర్కొన్నారు. సెల్‌ఫోన్ ద్వారా మంచి కంటే చెడు ఎకువగా ప్రచారం జరుగుతున్నదని, ఈ పరిస్థితిని అధిగమించాలంటే పుస్తక పఠనమే ఏకైక మార్గమని చెప్పారు. జీవితాలను తీర్చిదిద్దుకోవాలంటే పుస్తక పఠనం భాగం కావాలని సభకు వచ్చిన విద్యార్థులకు సూచించారు. సమాజ మార్పు కోసం పత్రికల సంపాదకులు నిరంతరం తమ కలం ద్వారా కృషి చేస్తున్నారని చెప్పారు. విద్యాశాఖ అధికారులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను పుస్తక వేడుకలకు తీసుకురావాలని సూచించారు. అవసరమనుకుంటే పుస్తక ప్రదర్శనను పొడిగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గాంధీని కనుమరుగు చేసే ప్రయత్నం..
విశిష్ట అతిథి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. గాంధీని కనుమరుగు చేసేందుకు కేంద్రంలోని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. గాడ్సేను దేశభక్తునిగా చిత్రీకరించడం అంటే చరిత్రను వక్రీకరించడమేనని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఫేక్ న్యూస్‌ను యువత నమ్మకూడదంటే, సత్యమేందో తెలుసుకోవాలంటే పుస్తకాన్ని పఠించాలని సూచించారు.
తెలంగాణ ఏర్పాటుకు విద్యార్థుల ఆత్మ బలిదానాలు, సీఎం కేసీఆర్ చేసిన పోరాటం, కృషి పుస్తకాల్లో నిక్షిప్తమై ఉన్నదని తెలిపారు. అందుకే విద్యార్థులు చరిత్ర పుస్తకాలను అధ్యయనం చేయాలని సూచించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సంపాదకులు కే శ్రీనివాస్, తిగుళ్ల కృష్ణమూర్తి, కే శ్రీనివాస్‌రెడ్డి, సుధాభాస్కర్, నాగేశ్వర్రావు, అంజయ్య ప్రసంగించారు. సాంసృ్కతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.