యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : నిత్యం బాంబుల మోత.. రాత్రీపగలు తేడా లేకుండా బ్లాస్టింగ్ రోత.. అనుమతులు ఉండవు.. అడిగేవాళ్లుండరు.. ఆడిందే ఆట.. పాడిందే పాట.. కోట్లలో అక్రమార్జన.. సర్కార్ ఖజానాకు గండి.. ఇదీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని చల్లూరు గుట్టల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ దందా. కొంతకాలంగా ఆలేరు ముఖ్య నేత కనుసన్నల్లో యథేచ్ఛగా సాగుతున్నది. జిల్లాలోని రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాలకు సరిహద్దులో చల్లూరు గుట్టలు ఉన్నాయి. సర్వే నంబర్ 322లో సుమారు వెయ్యి ఎకరాలకుపైగా కొండలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ, సీలింగ్, ప్రైవేట్ భూములు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలోనే ఈ గుట్టల్లో కొత్తగా ఓ క్రషర్ ప్రారంభించారు. గుట్టలు అనువుగా ఉండటంతో అప్పటినుంచి మైనింగ్ మాఫియా బరితెగించింది.
వాస్తవానికి అన్ని రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉండగా, నిబంధనలకు పాతరేసి పర్మిషన్లు లేకుండా ఇష్టారాజ్యంగా క్రషర్ నడిపిస్తున్నది. గ్రామ పంచాయతీలో గ్రామసభ తీర్మానం, విద్యుత్తు శాఖ, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్, తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎన్వోసీ తదితర అనుమతులు ఉండాలి. ఎలాంటి పర్మిషన్లు లేకపోయినా దర్జాగా వనరులను కొల్లగొడుతున్నది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖ నుంచి గతంలో తీసుకున్న అనుమతులతోనే అక్రమంగా కొనసాగిస్తున్నారు.
అనుమతులు లేవని, కేవలం అధికార పార్టీ అండదండలు మాత్రమే ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే పాత పత్రాలు చూపిస్తున్నారనే ప్రచారం ఉన్నది. ఇటీవల కొల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకోగా, ఎలాంటి అనుమతులు లేవని చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి, రాజాపేట తహసీల్దార్, విద్యుత్తు అధికారులు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అప్పటి కలెక్టర్ హనుమంతరావుకు ఫిర్యాదు చేయగా, కొన్నిరోజుల తర్వాత చర్యలు తీసుకోవాలంటూ మైన్స్ ఏడీ, ఆర్డీవోకు లెటర్ రాసినప్పటికీ వ్యవహారంలో మార్పు రాలేదు.

అక్రమ మైనింగ్ అంతా ఆలేరు ముఖ్యనేత కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఓ కంపెనీ యజమాని సదరు క్రషర్‌ను ముఖ్య నేతకు బహుమతిగా ఇచ్చారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అంతా ఆ నాయకుడే మేనేజ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న సమయంలోనే చల్లూరు గుట్టల గురించి ఆ నాయకుడికి అంతా తెలుసనే ప్రచారం జరుగుతున్నది. ఆ నేత అండదండలు ఉన్నాయనే భయంతోనే అధికారులు అక్రమ మైనింగ్ వైపు వెళ్లాలంటేనే జంకుతున్నట్టు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే రూ.కోట్లు కొల్లగొట్టారని తెలుస్తున్నది. అంతేకాకుండా నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ నిర్మాణ పని జరిగినా.. ఈ క్రషర్ నుంచే కంకర తీసుకెళ్లాలనే ఒత్తిడి ఉన్నట్టు తెలిసింది. ఇక ఇటీవల చల్లూరు గ్రామస్థులు ఆందోళనలు చేపట్టడంతో కొన్ని రోజులు నిలిపేసినట్టు డ్రామా చేశారు. మళ్లీ యథావిధిగా నడుస్తుండటంతో దీని వెనుక ఆ నేత హస్తం ఉన్నట్టు తెలుస్తున్నది.
భారీ బ్లాస్టింగ్‌తో భూకంపం వచ్చిందా అన్నట్టుగా భూములు కదులుతున్నాయి. నిబంధనల ప్రకారం పగలు మాత్రమే బ్లాస్టింగ్ చేయాల్సి ఉండగా, రాత్రిళ్లు సైతం బాంబుల మోత మోగిస్తూ గుట్టలను కరిగిస్తున్నారు. 30 మీటర్ల నుంచి 40 మీటర్ల లోతులోకి బోరు వేశాక బాంబులతో బ్లాస్ట్ చేస్తుండటంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లోని ఇండ్లకు పగుళ్లు వస్తున్నాయి. భూమి కంపిస్తుండటంతో కంటి మీద కునుకు ఉండటంలేదు. చిన్నపిల్లలు, వృద్ధులు నిద్రలోనుంచి లేచి ఉలిక్కిపడుతున్నారు.
దుమ్ము, ధూళి కారణంగా శ్వాస సంబంధిత వ్యాధులు ప్రబలుతున్నాయి. పంట పొలాల్లో పగుళ్లతోపాటు, భూగర్భ జలాలు సైతం పడిపోతున్నాయి. ముఖ్యంగా దత్తాయిపల్లి, మల్లాపురం, వేల్పల్లి, ఇబ్రహీంపూర్, చల్లూరు గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. పక్కనే ఉన్న అడవులు సైతం దెబ్బతింటున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో భారీగా టిప్పర్లలో కంకర తరలిస్తుండటంతో పొగ, దుమ్ముతో జనాలు అవస్థలు పడటంతోపాటు రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి.
చల్లూరు గుట్టల్లో రాత్రీపగలు తేడా లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారు. బాంబుల మోతకు చుట్టుపక్కల గ్రామాలన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇండ్లకు పగుళ్లు వస్తున్నాయి. శబ్దాలకు అన్నం తినేటప్పుడు మిద్దె మీది నుంచి మట్టి రాలి పళ్లెంలో పడుతున్నది. దుమ్మూ, ధూళితో పంటలు, మనుషులు ఆగమైపోతున్నారు. ఇండ్లలో ఉండలేకపోతున్నం. చిన్న పిల్లలు, ముసలోళ్ల పరిస్థితి మరీ దారుణం. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడంలేదు. అధికారులు కనీసం కన్నెత్తి చూడటంలేదు.
-గిద్దె కరుణాకర్, దత్తాయిపల్లి, తుర్కపల్లి మండలం
కంకర మిల్లులో అక్రమాలను వెలికితీయాల్సిన అధికారులు మొద్దు నిద్ర నటిస్తున్నారు. మైనింగ్ మాఫియా రోజూ ఎంత మేర కంకర తయారు చేస్తున్నారు? ఏ మేరకు నిల్వలు ఉన్నాయి? ఎంత మేర అమ్ముకుంటున్నారు? అని పరిశీలించాల్సిన అధికారులు నెలల తరబడి అటు వైపు కన్నెత్తి చూడటంలేదు. నిత్యం పదుల సంఖ్యలో రాత్రీపగలు ట్రక్కుల్లో కంకర తరలించి సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకోవడంలేదు. ఇక ప్రభుత్వానికి రావాల్సిన పన్నులకు ఎగనామం పెడుతున్నా తమకేంటీ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సర్కార్ ఆదాయానికి భారీగా గండిపడుతున్నది. ఇదే విషయమై యాదాద్రి మైన్స్ ఏడీని ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపుతామని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. యాదాద్రిలో బహిరంగంగా అక్రమ మైనింగ్ చేపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని సీఎం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. చల్లూరు గుట్టల్లో అక్రమ మైనింగ్ నిలుపుదల చేయాలి. గనుల అక్రమాలపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలి. బాధ్యులను శిక్షించాలి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రాబట్టాలి.
– గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఆలేరు