హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు ఏడాదిన్నరపాటు కసరత్తుచేసి తెరపైకి తెచ్చిన హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యమ్) రోడ్ల ప్రాజెక్టుకు ఆదిలోనే చుక్కెదురైంది. బ్యాంకు గ్యారెంటీ ఇస్తామని ప్రభుత్వం పదేపదే చెప్తున్నా… రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో తమకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు జంకుతున్నారు. ప్రభుత్వం ఆహ్వానించిన ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్-ఈవోఐ) టెండర్లకు ఒక్క ఏజెన్సీ కూడా ముందుకురాలేదు. పనులు చేస్తే ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయో.. రావో అనే భయం కాంట్రాక్టర్లను వెంటాడుతున్నది.
సాధారణంగా ప్రభుత్వం ఇచ్చే హామీకి చాలా విలువ, ప్రాధాన్యత ఉంటాయి. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నది. హ్యామ్ రోడ్ల విషయంలో కాంట్రాక్టర్లు తీసుకునే బ్యాంకు రుణాలకు తాము గ్యారెంటీగా ఉంటామని ప్రభుత్వం తెలిపింది. మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లిస్తామని, పనులు పూర్తయ్యేలోగా దశలవారీగా 40 శాతం, పనులు పూర్తయ్యాక వాయిదాల పద్ధతిలో 60 శాతం నిధులు చెల్లిస్తామని కాంట్రాక్టర్లకు చెప్పింది. అయినా కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. దీంతో హ్యామ్ రోడ్లకు ముందడుగు పడటంలేదు.
రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్‌శాఖల పరిధిలోని రోడ్లను హ్యామ్ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇటీవలే ఈవోఐలను ఆహ్వానించింది. ఈవోఐ గడువు పూర్తయినా ఒక్క ఏజెన్సీ కూడా ముందుకు రాకపోవడంతో ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించింది. ప్రభుత్వం ఇచ్చే హామీపై భరోసా లేకపోవడంతోనే తాము టెండర్లలో పాల్గొనలేదని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. తాము చేసిన పనులకు బిల్లులు వసూలు చేసుకునేందుకు ధర్నాలు చేయాల్సి వచ్చిందని, ఇంతవరకు బిల్లులు రాలేదని తమ అనుభవాలను ఏకరువు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ హ్యామ్ రోడ్లను చేపడితే తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని వాపోతున్నారు. రోడ్ల పనుల కోసం తాము తీసుకునే రుణాలకు ప్రభుత్వం బ్యాంకులకు లిఖితపూర్వకంగా గ్యారెంటీ ఇవ్వడంతోపాటు చెల్లింపుల విధానంపైనా స్పష్టత ఇస్తేనే పనులు చేపట్టడంపై ఆలోచిస్తామని స్పష్టంచేస్తున్నారు.
ఇతర రాష్ర్టాల్లో హ్యామ్ విధానంపై అధ్యయనం కోసం అధికారులను ఏపీ, మహారాష్ట్ర రాష్ర్టాలకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇతర రాష్ర్టాలకు, మన రాష్ర్టానికి పోలిక లేదని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. యూపీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, కర్నాటక తదితర రాష్ర్టాలు ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్), బీవోటీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) విధానాలను కలగలిపి హైబ్రిడ్ విధానంలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా రాష్ర్టాల్లో కాంట్రాక్టర్లు బ్యాంకుల ద్వారా రుణాలు సమకూర్చుకొని పనులు చేస్తుండగా, ప్రభుత్వం వారికి చెల్లింపులు చేస్తున్నది. కానీ మన రాష్ట్రంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏండ్ల తరబడి బిల్లులు చెల్లించడంలేదని కాంట్రాక్టర్లు చెప్తున్నారు.
హ్యామ్ విధానంలో భాగంగా ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో గ్రామాల నుంచి మండల కేంద్రాలకు ఉండే మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు ఉండే సింగిల్ లేన్ రోడ్లను డబుల్ లేన్ రోడ్లుగా, జిల్లా కేంద్రాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రహదారులను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో రూ.11,399 కోట్లతో 5,824 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లను, రూ.6,294 కోట్లతో 7,449 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఈవోఐలను ఆహ్వానించింది. కానీ హ్యామ్ విధానంపై సరైన మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీంతో ప్రభుత్వంపై భరోసాలేక ఏజెన్సీలు టెండర్లు వేయలేదు.