Hanamkonda | శాయంపేట, సెప్టెంబర్ 15: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాత ఇల్లు నేలమట్టమైంది. దీంతో ఆ పేద కుటుంబం కట్టుబట్టలతో వీధినపడింది. సాయం చేస్తారనుకున్న అధికారులు ఒక్కరూ దయచూపలేదు. దీంతో బాధిత కుటుంబానికి తామున్నామంటూ ఆ ఊరి ప్రజలే అండగా నిలిచారు. ఈ ఘటన ఆదివారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం సూర్యనాయక్ తండాలో జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తండాలోని జుర్పుల బాలు పాత ఇల్లు నేలమట్టమైంది. కూతురు, కుమార్తె, భార్యతో కలిసి బాలు పాత పెంకుటింటిలో ఉంటూ రోజు కూలి చేసుకుంటూ జీవిస్తున్నాడు. వానలకు తడిసిన ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది.
అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇల్లు కూలడంతో ఇంట్లోని సామగ్రి, బట్టలతోపాటు ఇతర వస్తువులు పనికిరాకుండా పోయాయి. దీంతో నిలువనీడ లేక గ్రామంలోని ఒకరి ఇంట్లో తలదాచుకుంటున్నారు. ఉన్న ఇల్లు కూలిపోయింది.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. అధికారులు సాయం చేయాలని పలుమార్లు బాలుతోపాటు గ్రామస్థులు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. అయినా ఎవరూ ఆదుకోలేదు. దీంతో తండాలోని యువకులు, ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ పెద్దలు మానవత్వంతో వారికి అండగా నిలిచారు. తలా కొంత వసూలు చేసి రూ.25 వేలు బాలు కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ భూక్యా రమేశ్, మాజీ ఉప సర్పంచ్ వస్రం, మాజీ ఎంపీటీసీ రెడ్డినాయక్, సుమన్, రవీందర్, దేవ్‌సింగ్, సునీల్, బాష పాల్గొన్నారు.