హైదరాబాద్, జూన్13 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్, ఆలోపు చదివే విద్యార్థులందరూ మైనర్లే. హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఇచ్చే కాస్మొటిక్ చార్జీలను ఇప్పటివరకు హాస్టళ్ల నిర్వాహకులే చెల్లించేవారు. ఈ ఏడాది నుంచి విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే కాస్మొటిక్ చార్జీల నగదును వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, మైనర్ విద్యార్థులకు బ్యాంకు ఖాతాలు ఎవరిస్తారు? ఒకవేళ ఇచ్చినా హాస్టల్ విద్యార్థులు ఎలా బయటకు వెళ్లి ఆ నగదును డ్రా చేసుకుంటారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నాయి. నేరుగా నగదు బదిలీ అంటూ ఊదరగొడుతూ కాస్మొటిక్ చార్జీలకు ఎగనామం పెట్టేందుకే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నదని విద్యార్థి సంఘాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ కలిపి మొత్తంగా 1,022 గురుకులాలు, 450కి పైగా కస్తూర్బాగాంధీ, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ప్రీమెట్రిక్, పోస్ట్మెట్రిక్ హాస్టళ్లు కొనసాగుతున్నాయి. ఆయా హాస్టళ్ల అన్నింటిలో కలిపి దాదాపు 6 నుంచి 8 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం నెలవారీగా హెయిర్ కటింగ్, సోప్స్ తదితరాల కోసం కాస్మొటిక్స్ చార్జీలను వారి తరగతి, వయసు ఆధారంగా చెల్లిస్తుంది. ఇప్పటివరకు ఈ కాస్మొటిక్ చార్జీలను సదరు గురుకుల ప్రిన్సిపాళ్ల, హాస్టల్ వార్డెన్ల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఆ మొత్తాన్ని డ్రాచేసి విద్యార్థులకు పంపిణీ చేయడం ఏండ్లుగా కొనసాగుతూ వస్తున్నది. ఈ ఏడాది నుంచి కాస్మొటిక్ చార్జీలను నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకోసం నెలాఖరునాటికి బ్యాంకు ఖాతాలు తీయించాలని ఆదేశాలు జారీచేసింది.
ఇంటర్ వరకు విద్యార్థులందరూ దాదాపు 18 ఏండ్లలోపు వారే. వారందరూ మైనర్లే. బ్యాంకులు మైనర్లకు ఖాతాలు ఇవ్వడం లేదు. గార్డియన్ పేరిట ఇవ్వడం పరిపాటి. ఒకవేళ ప్రభుత్వం బ్యాంకులతో సంప్రదించింది ప్రత్యేక క్యాటగిరీ కింద విద్యార్థులతో జీరో బ్యాలెన్స్ అకౌంట్లను తెరిపించినా కూడా వాటిని మైనర్ విద్యార్థులు ఎలా నిర్వహించగలరు అనేది మరో ప్రశ్న. బ్యాంకులో జమ చేస్తే నగదును డ్రా చేయాలంటే విద్యార్థులు మళ్లీ బయటకు వెళ్లాల్సిందే. హాస్టల్ విద్యార్థులను ఎవరు తీసుకెళ్తారు? అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నాయి.