శివ్వంపేట, జనవరి 26 : మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం వివాదాస్పదమైంది. స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఎవరూ లేకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. జెండా ఆవిష్కరణ అనంతరం విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధులు ఎవరూ లేకుండా, గ్రామస్తులకు సమాచారం ఇవ్వకుండానే కేవలం అధికారులే జాతీయ జెండాను ఎగరవేయడం ద్వారా తమను అవమానపరిచారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా డప్పు చప్పుడుతో, ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా జరిగే గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని గ్రామస్తులను పిలవకుండానే నిర్వహించడం సరికాదని వారు మండిపడ్డారు. “ఇది కేవలం అధికారిక కార్యక్రమం కాదు, ప్రజల పండుగ” అని పేర్కొంటూ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.