జైపూర్, సెప్టెంబర్ 10 : శ్రీరాంపూర్ డివిజన్లోని ఇందారం ఖని-1ఏ గనిలో మంగళవారం మొదటిషిప్టులో పని చేస్తున్న జనరల్ మజ్దూర్ ఊపిరాడక మృతిచెందాడు. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖనిలోని గాంధీనగర్‌కు చెందిన ఎల్లవేన శ్రీనివాస్ (35) ఐకే-1ఏ మొదటి షిప్టు అండర్ గ్రౌండ్లో ఎస్-1 ప్యానల్ 35వ డిప్-4 లెవల్ వద్ద మంగళవారం విధులు నిర్వహిస్తుండగా, గాలి అందక కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే అండర్ గ్రౌండ్ నుంచి బయటకు తీసుకువచ్చారు. అంబులెన్స్‌లో రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. గనిలో వెంటిలేషన్ సరిగా లేకపోవడం వల్లే శ్రీనివాస్ మృతిచెందినట్టు కార్మికులు పేర్కొంటున్నారు.
శ్రీనివాస్ మృతికి యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎంఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గనిపై ధర్నా నిర్వహించారు. నాయకులు, కార్మికులు మాట్లాడుతూ కొంతకాలంగా 34, 35, 53 డిప్‌లలో గాలి సరఫరా లేదని కార్మికులు యాజమాన్యానికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, తాజాగా కార్మికుడు ఊపిరాడక చనిపోతే గుండెపోటు, ఫిట్స్‌తో చనిపోయాడని కట్టుకథలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు సారయ్య డిమాండ్ చేశారు. తన భర్త పని ప్రదేశంలోనే మృతి చెందినప్పటికీ బతికి ఉన్నట్టుగా అధికారులు దవాఖానకు తరలించి వైద్యం అందించినట్టు చిత్రీకరించారని శ్రీనివాస్ భార్య అనిత వాపోయింది.