ఖిలావరంగల్, అక్టోబర్ 24: కాకతీయుల వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఓరుగల్లు కోటలోని చారిత్రక కట్టడాలు రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో ధ్వంసమవుతున్నాయి. కాకతీయుల కాలం నాటి ధాన్యాగారం రిలయల్టర్ల ఆక్రమణలకు గురవుతున్నది. మట్టికోట ఉత్తర ద్వారానికి సమీపంలో ఉన్న ధాన్యకటకం విధ్వంసాన్ని అడ్డుకోవాల్సిన కేంద్ర పురావస్తుశాఖ అధికారులు, సిబ్బంది చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంపై పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రెండెకరాల విస్తీర్ణం ఉన్న ధాన్యకటకంను కాకతీయ చక్రవర్తులు మహా అద్భుతంగా నిర్మించారు. చుట్టూ బండరాళ్లతో ప్రహరీ, మూడు వైపులా పైకి వెళ్లేందుకు రాజసం ఉట్టిపడేలా ప్రవేశ ద్వారాలున్నాయి. ధాన్యాగారం దిబ్బపైకి ఎక్కిన తర్వాత మధ్యలో భూ అంతర్భాగంలోకి వెళ్లేందుకు మెట్లు కనిపిస్తాయి. డంగు సున్నంతో నిర్మించిన పైకప్పు ఉంటుంది. కాకతీయులు తమ అవసరాలకు అనుగుణంగా ధాన్యాన్ని నిల్వ చేసుకునేవారని తెలుస్తున్నప్పటికీ ఈ ధాన్యకటకంలో ఇంకా ఏమి నిల్వ చేసుకునేవారో తెలియని పరిస్థితి. గతంలో పురావస్తుశాఖ చేపట్టిన తవ్వకాల్లో ఈ ప్రాంతంలో సొరంగ మార్గం బయటపడినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. ధాన్యకటకం ప్రాంతంలో మహిషాసురమర్ధిని విగ్రహమూర్తితో పాటు శివలింగ ప్రాణమట్టం ఉండటాన్ని బట్టి ఈ ప్రాంతంలో ఊహించని అద్భుతం నిగూఢమై ఉన్నట్టు సమాచారం.
ధాన్యాగారంపై రియల్ ఎస్టేట్ పేరుతో అక్రమంగా తవ్వకాలు చేపట్టడటంతో చారిత్రక కట్టడాల వైభవం అంతరించిపోతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక కట్టడాల నుంచి 100 మీటర్ల దూరం వరకు కేంద్ర పురావస్తు శాఖ నిషేధిత స్థలంగా ప్రకటించింది. ఆ పరిధి దాటి నిర్మాణాలు చేపట్టాలంటే ఎన్వోసీ తప్పనిసరి. రియల్టర్లు వంద మీటర్ల దూరం సంగతి పక్కన పెడితే ఏకంగా ధాన్యాగారం కట్టడానికే ఎసరుపెట్టి బండరాళ్లను తొలగిస్తుండటంపై పర్యాటకులు, చరిత్రకారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చారిత్రక కట్టడాలను కాపాడాల్సిన పురావస్తు శాఖలో పదుల సంఖ్యలో ఉద్యోగులు, సిబ్బంది ఉన్నా, వారు ప్రేక్షకపాత్ర వహించడంపై వారు రియల్టర్లతో కుమ్మక్కయ్యారా ? అనే చర్చ కోటలో జరుగుతున్నది. మూడు రోజులుగా పనులు జరుగుతున్నా ఆ శాఖ ఉద్యోగులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో చరిత్రకారులు, పర్యాటకులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అధికారులు స్పందించి కాకతీయుల ధాన్యాగారాన్ని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.