హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఏదైనా కేసులో నిందితులను అరెస్టు చేసేముందు సుప్రీంకోర్టు డీకే బసు కేసులో జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను హైకోర్టు హెచ్చరించింది. అక్రమంగా అరెస్ట్ చేసిన దుబాసి దేవేందర్‌ను విడదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్, జగదల్పూర్ జిల్లా జైలు సూపరింటెండెంట్, ఎన్ఐఏ అధికారులకు ఉత్తర్వులు జారీచేసింది. సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలో పరీక్షలకు హాజరవుతున్న తన భర్త దేవేందర్‌ను ఎన్ఐఏ అధికారులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారని పేరొం టూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పసుమాములకు చెంది న స్వప్న దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ కే సుజనతో కూడిన ధర్మాసనం విచారించింది.
పరీక్షలకు హాజరవుతున్న పిటిషనర్ భర్తను మఫ్టీలో ఉన్న పోలీసులు.. తాము ఎవరో చెప్పకుండా తీసుకెళ్లి ములుగు పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారని పిటిషనర్ తరఫు లాయర్ చెప్పారు. ఎన్ఐఏ న్యాయవాది స్పందిస్తూ, పిటిషనర్‌కు 41ఏ కింద నోటీసులు ఇచ్చామని, నిషేధిత సీపీఐ (మావోయిస్టు) ఇతర సంస్థలకు అతడు కొరియర్‌గా వ్యవహరించారని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు, 41ఏ నోటీసులోని లోపాలను ఎత్తి చూపింది. పిటిషనర్ భర్తను విడుదల చేయాలని ఆదేశించింది.