హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రస్థాయి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాల ప్రక్రియ జరుగుతున్నదని, కొంత గడువు ఇస్తే పూర్తి వివరాలను నివేదిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ నెల 28న జరిగే తదుపరి విచారణ నాటికి వివరాలు అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
సికింద్రాబాద్ లాలాపేట్కు చెందిన సామాజిక కార్యకర్త ఎస్ గణేశ్రావు ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం విచారించింది. ఫిబ్రవరి 28న జరిగిన విచారణ సమయంలో చైర్మన్, సభ్యుల నియామకాలకు ఆదేశాలిచ్చామని గుర్తు చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.