హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం జరిగిందన్న కారణంతో కేసు కొట్టివేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. మూడేండ్లకుపైగా జైలుశిక్ష పడే కేసు ల్లో ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం జరిగినంత మాత్రాన కేసును కొట్టివేయడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని పేరొంది. కుటుంబ వివాదాల నేపథ్యంలో ఓ బాలుడిపై హత్యాయత్నం చేసిందన్న కేసులో నిందితురాలు దాఖలు చేసిన పిటిషన్ను హై కోర్టు కొట్టివేసింది. ఒకే ఇంటిలో ఉన్న భర్త సోదరుడి కుమారుడికి యాసిడ్ తాగించి చంపడానికి ప్రయత్నించిందంటూ మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ పార్వతం మంజుల హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్పై జస్టిస్ జే శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కుటుంబ విభేదాలను అడ్డుపెట్టుకొని ఆమెను క్రిమినల్ కేసులో ఇరికించారని చెప్పారు. పిల్లవాడు పొరపాటున యాసిడ్ తాగాడని తెలిపారు. ఏప్రిల్ 9న ఘటన జరుగగా, 14న ఫిర్యాదు చేశారని, అందువల్ల దురుద్దేశపూరితంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు కొనసాగుతున్నదని, ఈ దశలో కేసును కొట్టివేయరాదని కోరారు.