హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : అడ్డగోలు అప్పులతో రాష్ట్రాన్ని పంజాబ్ తరహా దివాలా తీయిస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్ చేస్తున్న అంకెల గారడీ బయటపడిందని, ఇందుకు కాగ్ నివేదిక సాక్ష్యమని తెలిపారు. బడ్జెట్లో రూ.6,857 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని చెప్పిన ప్రభుత్వం, కేవలం 150 రోజుల్లోనే రాష్ట్రాన్ని ఏకంగా రూ.14,840.81 కోట్ల రెవెన్యూ లోటులోకి నెట్టిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సీఎం రేవంత్రెడ్డి అప్పుల రారాజుగా మారారని విమర్శించారు. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిలో 60.8 పైసలకుపైగా కేవలం అప్పుల వడ్డీలు, జీతాలు, పెన్షన్లకే సరిపోతున్నదని శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ లేకుండా మూసీ, మెట్రో-2, ఫ్యూచర్ సిటీ అంటూ గ్రాఫిక్స్ ప్రచారాలు చేస్తున్నారని, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు అడిగితే ఇవ్వడం లేదని తెలిపారు.