నగోయా: భారీ అంచనాలతో, పతక ఆశలతో ఆసియా గేమ్స్ కోసం ఆతిథ్య జపాన్లోని ఐచి నగోయాకు చేరుకున్న భారత్తో పాటు పలు దేశాల క్రీడాకారులకు సమస్యలు స్వాగతం పలికాయి. సరైన సౌకర్యాలు లేకపోవడం, వేదికలకు సుదూర ప్రాంతాల్లో వసతి కేటాయించడంతో వేలాది మంది అథ్లెట్లు, కోచ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగోయా పోర్ట్లో నిలిపి ఉంచిన ‘కోస్టా సెరెనా’ క్రూయిజ్ షిప్లోఇద్దరు ఉండే చిన్న గదిలో ముగ్గురు అథ్లెట్లను ఉంచడంతో భారత రోయింగ్, ఉషూ, టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారు.
థాయిలాండ్ అథ్లెట్లు గదులు దొరక్క క్రూయిజ్ షిప్ వెల్కమ్ సెంటర్లోని నేలపైనే నిద్రించారు. మను భాకర్, ఇషా సింగ్ వంటి స్టార్లతో కూడిన భారత షూటింగ్ బృందానికి షూటింగ్ రేంజ్ నుంచి 50 కి.మీ దూరంలో హోటల్ కేటాయించారు. దీంతో రోజూ 2 గంటల ప్రయాణం చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.