బెంగళూరు, సెప్టెంబర్ 17: మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఎలాంటి విచారణకు నోచుకోకుండా గత 21 ఏండ్లుగా బెంగళూరు కేంద్ర కారాగారంలో మగ్గుతున్న ఒక విచారణ ఖైదీ దుస్థితిపై కర్ణాటక హైకోర్టు స్పందించింది. ఆ ఖైదీకి చెందిన రికార్డులు అదృశ్యమైన సంగతిని న్యాయస్థానం గుర్తించింది. కేసును విచారించిన న్యాయమూర్తి సీఎం పూంచా కర్ణాటక రాష్ట్ర న్యాయ సేవల సాధికార సంస్థను ప్రతివాదిగా చేరుస్తూ విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేశారు.
భార్యను హత్య చేశాడన్న ఆరోపణపై శ్రీనివాస అనే వ్యక్తిని 2005లో కోలార్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రయల్ కోర్టు బెయిల్ తిరస్కరించడంతో ఆయన అప్పటి నుంచి 21 ఏండ్లుగా జైలులోనే ఎలాంటి విచారణ లేకుండాఉన్నాడు. ఈ విషయాన్ని న్యాయవాదులు విక్రమ్ రాజ్, అశ్విన్ జాయ్స్టాన్లు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆయన కేసు రికార్డుల గురించి అడుగగా,అవి కన్పించడం లేదన్న విషయం ఆగస్టులో బయటపడింది.